TDP Protest : రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనను జగన్ గాలికొదిలేశాంటూ తెలుగుదేశం నేతలు చట్టసభలతో పాటు అసెంబ్లీ బయట చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరుద్యోగ సమస్యపై నిరసన తెలిపారు.
రెండు లక్షల 30 వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. జాబ్ రావాలంటే జగన్ పోవాలంటూ నినదించారు. తర్వాత తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన ర్యాలీగా వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ జాబ్ క్యాలెండర్ పదాన్ని పదేపదే ప్రస్తావించి..అధికారంలోకొచ్చాక దాన్ని విస్మరించారని నేతలు మండిపడ్డారు.
జాబ్ కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బ్యాచ్‌లుగా విడిపోయిన శ్రేణులు అసెంబ్లీ ప్రారంభమయ్యాక చట్టసభల భవనం ముట్టడే లక్ష్యంగా వివిధ మార్గాల్లో చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి. ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
వెలగపూడి చెక్ పోస్ట్, అసెంబ్లీ ప్రధాన గేటు పరిసరాల వద్ద పోలీసులకు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాతో మాట్లాడేందుకు యత్నిస్తున్న నాయకులను పోలీసులు నోరు నొక్కి మరీ వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌లకు తరలించారు.
తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులపై పోలీసుల దాడిని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగ విప్లవం తీసుకొస్తానన్న జగన్ మాట తప్పి మడమ తిప్పారని నేతలు విమర్శించారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. మెగా DSC హామీ అమలు కాలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు కల్పించాలన్న తెలుగు యువత కార్యకర్తల రక్తం కళ్ల చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌరవ సభను తలపించేలా చట్ట సభలు ఉన్నాయని ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 అంశాల ప్రజా సమస్యలు చర్చించాలని పట్టుబడితే కేవలం రెండింటినే అంగీకరించడం దుర్మార్గమన్నారు.
ఇవీ చదవండి: