TDP protests on Power cuts in AP: ప్రభుత్వ అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని తురకలాపట్నం విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. పెనుకొండ - పావుగడ ప్రధాన రహదారిపై బైఠాయించి.. నినాదాలు చేశారు. కదిరి మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోనూ బాదుడే బాదుడు అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని నిరసన తెలిపారు.
TDP protests on Power cuts in AP: 'బాదుడే బాదుడు' నినాదాలతో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు ప్రదర్శన చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దైవందిన్నె విద్యుత్తు ఉపకేంద్రం వద్ద తెలుగుదేశం నేతలు కొవ్వొత్తులు, లాంతర్లతో ధర్నా చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నంద్యాలలో డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వుత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
"ఛార్జీలు పెంచడమే కాకుండా... ఎవరికీ సమాచారం లేకుండా పవర్ కట్ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నపిల్లలు మరణిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. చాలా దౌర్భాగ్యస్థితిలో మన రాష్ట్రముందని ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."- భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా మాజీ ఎమ్మెల్యే
విద్యుత్ ఛార్జీలపై శ్రీకాకుళం జిల్లాలో నిరసన చేపట్టిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: పరిశ్రమలపై మరో పిడుగు... విద్యుత్‌పై సుంకం పెంపు