చంద్రబాబు లేఖకు స్పందించిన తమిళనాడు ప్రభుత్వం - చంద్రబాబు తాజా వార్తలు
చెన్నైలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలంటూ... తెదేపా అధినేత చంద్రబాబు రాసిన లేఖకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. వలస కార్మికుల కష్టాలపై ఈనెల 7, 14 తేదీల్లో రెండు వేరువేరు లేఖలను చంద్రబాబు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి రాశారు. చెన్నైలో 2 వేల మంది వలస కార్మికులను ఆదుకోవాలని వాటిలో పేర్కొన్నారు. తెలుగువారి ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను లేఖకు జతచేసి పంపారు. చంద్రబాబు పేర్కొన్న కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రేషన్ కిట్లను పంపిణీ చేసింది. చెన్నై కార్పొరేషన్ ద్వారా 2వేల మందికి వీటిని అందచేసినట్లు ప్రత్యుత్తరం పంపారు. తమిళనాడు ప్రభుత్వానికి, చెన్నై కార్పొరేషన్ అధికారులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.