రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం వాదనలు, ఆలోచనలు వినకుండా హైకోర్టు ఈ తీర్పు వెలువరించిందని.. తాము లేవనెత్తిన ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోనందున పిటిషన్‌పై విచారణ చేపట్టాలని దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అమరావతికి చెందిన మిగిలిన కేసులతో కలిపి విచారించాలని దుష్యంత్ దవే కోరారు. రాజధాని వచ్చే ప్రాంతాన్ని తమ వాళ్లకు ముందే చెప్పారని వాదించారు. ప్రాథమిక దర్యాప్తును నిలిపివేసే అధికారం హైకోర్టుకు లేదని దుష్యంత్ దవే స్పష్టం చేశారు. ఆస్తుల కొనుగోలులో అధికారులు, నేతలు ప్రైవేటు వ్యక్తులతో కలిశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పట్టించుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీంకు వివరించారు.
తోసిపుచ్చిన ధర్మాసనం..
దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు తమకు కనిపించడం లేదంటూ దుష్యంత్ దవే వాదనలతో విభేదించింది. ఈ అంశంపై భూ విక్రేతలు ఫిర్యాదు చేశారా అని రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితులు కోర్టుకు వెళ్లవచ్చు.. ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటన్ని అడిగింది. సిట్ కేసుతో జతచేసి కేసును విచారించాలన్న దవే అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అదనపు సమాచారం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేసులో ఇంకా వినాల్సిన విషయాలు ఏమున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హరియాణా భూసేకరణ అవకతవకల తీర్పు పరిశీలించాలని దుష్యంత్ దవే కోరారు. హరియాణా కేసు వివరాలు కోర్టుకు ఇచ్చేందుకు సమయం కావాలన్నారు. హరియాణా కేసుకు, అమరావతి కేసుకు సంబంధం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అనేక విషయాల్లో రెండు కేసులకూ సారూప్యత ఉందని దుష్యంత్ దవే అన్నారు. తీర్పు కాపీ దాఖలుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. అనంతరం కేసు తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: