Gali Janardhan Reddy Case: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ నిబంధనలు సడలించాలని గాలి జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణ చేపట్టాలని తెలిపింది. విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీం అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో.. బెయిలు నిబంధనలు సడలించాలని ప్రధాన నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే బళ్లారిలో ఉన్నందున తన కుమార్తె, మనవరాలితో గడిపేందుకు నవంబర్ 6 వరకు అవకాశం ఇచ్చింది. నవంబర్ 9 నుంచి రోజువారీ ప్రాతిపదికన గనుల అక్రమ తవ్వకాల కేసు విచారణ.. నిర్వహించాలని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీం ఆదేశించింది. విచారణ మొదలుపెట్టిన తేదీ నుంచి ఆర్నెళ్లలో తప్పక పూర్తి చేయాలని నిర్దేశిచింది. నిందితులంతా న్యాయస్థానానికి సహకరించాల్న సుప్రీంకోర్టు.. విచారణను ఆలస్యం చేయడానికి నిందితులు ప్రయత్నిస్తే.. దాన్ని తీవ్రంగా పరిగణించాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలిచ్చింది. నవంబర్ 7 నుంచి విచారణ ముగిసేవరకూ.. గాలి జనార్ధన్‌రెడ్డి సహా నిందితులెవరూ బళ్లారి, అనంతపురం, కడప జిల్లాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కేసులో చాలా మంది సాక్షులు బళ్లారి, అనంతపురం, కడప జిల్లాల వారైనందున.. ఈ మూడు జిల్లాల్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తే... సాక్షులను ప్రభావితం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థ.. భయాందోళనలు నిజమని నిరూపింతమైందని, గతంలో న్యాయాధికారుల్నీ ప్రభావితం చేశారని కోర్టు గుర్తుచేసింది.
ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11 ఏళ్లు గడుస్తున్నా.. తామే ఆదేశాలిచ్చినా విచారణ ప్రారంభం కాకపోవడం చాలా విచారకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రికార్డుల ప్రకారం.. నిందితులు, సహ నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, అందుకే విచారణ జరగలేదని అర్ధమవుతోందని పేర్కొంది. విచారణను వీలైనంత త్వరగా ముగించడంపై అంతా ఆసక్తి చూపుతారని.. త్వరగా ముగిస్తే న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. తీవ్రమైన నేరాల విచారణలో.. జాప్యం చేసేందుకు నిందితులు చేసే ఎంతటి ప్రయత్నాన్నైనా.. ఉక్కుపాదంతో అణిచివేయాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ ఎంత ఆలస్యమైతే.. సాక్షులపై అంత ప్రభావం చూపొచ్చని నిందితులు భావిస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఇవీ చదవండి: