అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ చొరవ చూపిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు సీజే నివాసంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైందని తెలిపారు. దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందన్నారు.
ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోందని.. ఆర్బిట్రేషన్ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారని చెప్పారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి తెలంగాణ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. త్వరగా ఆర్బిట్రేషన్ కేంద్రం కార్యకలాపాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణలో ఈ రోజు చరిత్రత్మకమైన రోజు. మూడు నెలల్లో నా కల నిజమవుతుందని అనుకోలేదు. నా కల సాకారానికి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, ఇతర అధికారులకు ధన్యవాదాలు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్‌లో హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ప్రతిపాదన చేయవాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాను. వెంటనే స్పందించిన వారు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ అవసరాన్ని గుర్తిస్తూ జూన్ 30న లేఖ రాశారు.
-జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇదీ చదవండి:spice jet services: గన్నవరం నుంచి స్పైస్ జెట్ సర్వీసులు బంద్