kurupam: విజయనగరం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురై మృతిచెందిన విద్యార్ధి రంజిత్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొమరాడ మండలం దలాయిపేటకు చెందిన మంతిని రంజిత్.. విజయనగరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో.. విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ముందు ధర్నా చేపట్టారు.
వారికి స్థానిక తెదేపా, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే పాము కాటుకు గురై విద్యార్ధి చనిపోయాడంటూ వసతి గృహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు బాధ్యుడైన ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
అసలేం జరిగింది..?
విజయనగరం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలోని బాలుల వసతిగృహంలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. వీరిలో మంతిని రంజిత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. విజయనగరంలోని తిరుమల ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు. మృతుడు మంతిని రంజిత్ స్వస్థలం కోమరాడ మండలంలోని దళాయిపేట గ్రామమని.. మరో ఇద్దరు విద్యార్థులు ఈదుబుల్లి వంశీ సాలూరు మండలం జీగారం, నవీన్ చినభోగిలి జగ్గూనాయుడుపేటకు చెందినవారని అధికారులు తెలిపారు.
గురుకుల పాఠశాల వసతిగృహం విద్యార్థులు గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో... మొదట ఒక విద్యార్థి పాముకాటుకు గురికాగా.... వెంటనే కాపలాదారు సహాయంతో స్థానిక కురుపాం ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా.. మరో ఇద్దరు పాముకాటుకు గురైనట్లు సమాచారం అందింది. ముగ్గురు విద్యార్ధులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం.. పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరం తిరుమల ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వారిలో మంతిని రంజిత్ చనిపోయాడు.
ఇదీ చదవండి: NRIs on high court Verdict : అమరావతిపై హైకోర్టు తీర్పు.. అమెరికాలో సంబరాలు