రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులపై సర్వే నిర్వహించి రెండున్నర నెలల్లో నివేదికను సమర్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు, మైనారిటీ సంక్షేమ అధికారులను ఆదేశించారు. 13 జిల్లాల రెవెన్యూ అధికారులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో 10వేల 600 వక్ఫ్ ఆస్తులుండగా ఇప్పటికే సుమారు 3500 ఆస్తుల సర్వేను పూర్తి చేసి నోటిఫై చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని.. మిగిలిన 7,100 ఆస్తుల సర్వేను సమగ్ర భూ రక్షణ సర్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా రెవెన్యూ అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కలిసి కూర్చుని మిగిలిన ఆస్తుల సర్వే ఏ విధంగా పూర్తి చేయాలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో ఎస్సీ ,క్రైస్తవులు, ముస్లింలకు తప్పక శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాల్సి ఉందని.. ఆ సమస్యను త్వరితగతిని పరిష్కరించాలని తెలిపారు. ఏఏ గ్రామాల్లో స్మశాన వాటికలకు స్థలాలు అందుబాటులో ఉంది.. ఇంకా ఏఏ గ్రామాల్లో స్థలాలు అవసరం ఉందనే దానిపై నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలను సమర్పించాలని ఆదేశించారు. అంతేగాక వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకై చుట్టూ కాంపౌండ్ వాల్స్ నిర్మించేందుకు వీలుగా డ్వామా అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి:
CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్