Rice distribution: పేదలకు రేషన్ బియ్యం పంపిణీ భారమే అన్నట్లు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రాయితీని వదిలించుకోడానికి ఆ పేదలనే అడ్డుపెట్టుకుని కేంద్రంతో బేరాలు ప్రారంభించింది. చివరకు దాన్ని రైతుల మెడకు చుట్టేదాకా తెచ్చింది. కరోనా కష్టాల్లో ఉన్న పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ఆరు విడతలుగా ఉచిత బియ్యం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోవిడత పంపిణీకి రాష్ట్రం మోకాలడ్డింది.
నాలుగు నెలలుగా పంపిణీ నిలిపేయడం ద్వారా 2.68 కోట్ల మంది పేదలకు రూ.2,051 కోట్ల విలువైన బియ్యాన్ని అందకుండా చేసింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులనూ జాతీయ ఆహారభద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోకి తేవాలని డిమాండు పెట్టింది. తద్వారా రూ.3వేల కోట్లకు పైగా రాయితీ భారాన్ని దించుకోవాలని చూస్తోంది. కేంద్రం దీనికి ససేమిరా అంటోంది. బియ్యం పంపిణీ చేయకపోతే రాష్ట్రంలో ధాన్యం సేకరణనే నిలిపేస్తామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ బుధవారం హెచ్చరించారు. దీంతో వరి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు నెలలుగా పంపిణీ నిలిపివేత: కరోనా ప్రారంభం నుంచి కేంద్రం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చే కార్డులకు పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం ఇస్తోంది. అయిదు విడతలు రాష్ట్రంలోనూ పూర్తయింది. ఆరోవిడత కింద ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఒక్కో కుటుంబసభ్యునికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇవ్వాలి. అయితే ఈసారి రాష్ట్రప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకే కాకుండా.. రాష్ట్ర పరిధిలోని కార్డులకూ బియ్యం ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాసింది. నిర్ణయం వచ్చేవరకూ ఎవరికీ పంపిణీ చేయబోమని భీష్మించింది.
రాయితీ భారం దించుకునేందుకే: రాష్ట్రంలో మొత్తం 1.45 కోట్ల రేషన్‌కార్డులు, వీటిలో రెండు రకాలు ఉన్నాయి. జాతీయ ఆహారభద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద కేంద్రం రాయితీపై నిత్యావసరాలు ఇచ్చేవే 61% పైగా ఉన్నాయి. మిగిలినవన్నీ రాష్ట్ర పరిధిలోని కార్డులే. పేదరికంపై సర్వేల ఆధారంగా నీతి ఆయోగ్.. రాష్ట్రాల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులను గుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ జనాభాలో 60.96%, పట్టణ జనాభాలో 41.14% మందిని.. మొత్తంగా 88.75 లక్షల కార్డుల్లోని 2.68 కోట్లమంది పేదలను జాతీయ ఆహారభద్రతా చట్టం పరిధిలోకి తెచ్చింది. ఇవికాకుండా రాష్ట్రం గుర్తించిన 56.71 లక్షల కార్డుల్లో 1.57 కోట్ల మంది ఉన్నారు.
* పీఎంజీకేఏవై కింద కేంద్రం 2.68 కోట్లమందికే ఉచిత బియ్యం ఇస్తుంది. మిగిలిన 1.57 కోట్ల మందికి రాయితీని రాష్ట్రమే భరించాలి. ఇందులో 90% మంది బియ్యం తీసుకుంటారనుకున్నా.. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున నెలకు రూ.270 కోట్ల భారం పడుతుంది. ఆరోదశలో ఆరు నెలలకు రూ.1,620 కోట్లు మోయాల్సి వస్తుంది. ఈ కార్డులనూ కేంద్రచట్టం పరిధిలోకి తీసుకుని బియ్యం కేటాయించాలని రాష్ట్రం అడిగింది. ఉచిత బియ్యం పంపిణీ నిలిపేయడంతో రేషన్ డీలర్లు వాటిపై ఆరు నెలల్లో రూ.180 కోట్లు కమీషన్ కోల్పోయారు.
ధాన్యం సేకరణ నిలిపేస్తే రైతులకు భారీ నష్టం: పీఎంజీకేఏవై కింద పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకుంటే మద్దతు ధరకు ధాన్యం సేకరణ నిలిపేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఇదే జరిగితే అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారుతుంది. కేంద్రం సేకరణ నిలిపేస్తే మిల్లర్లు ధర మరింత తగ్గిస్తారు. రైతులు భారీగా నష్టపోతారు. ఖరీఫ్‌లో సాగు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కేంద్రమంత్రి ప్రకటన ఈ రైతుల్లో కలవరం రేకెత్తిస్తోంది.
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే: ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, రాష్ట్ర కార్డులు కొన్నేళ్లుగా ఉన్నాయి. పీఎంజీకేఏవై కింద ఈ ఏడాది మార్చి వరకూ కార్డుదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. ఏప్రిల్ నుంచే పంపిణీ నిలిపేసింది. కేంద్రం మొత్తం కార్డులను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కిందకు తీసుకుంటుందనే ఆలోచనే దీనికి కారణంగా చెబుతున్నారు. ఒకసారి కేంద్రచట్టం పరిధిలోకి కార్డులు చేరితే.. రాష్ట్రంలోని 1.45 కోట్ల కార్డులకు రాయితీ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. దీంతో పీఎంజీకేఏవై కింద 6నెలలకు భరించాల్సిన రూ.1,620 కోట్లతో పాటు.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీచేసే రేషన్‌కూ నెలకు రూ.270 కోట్ల చొప్పున ఏడాదిలో రూ.3,240 కోట్ల భారం తగ్గుతుంది. అందుకే కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.
సాధ్యం కాదని తేల్చిన కేంద్రం: ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధీకరణ లేదని సీఎం జగన్ పలుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రాలు అందించారు. లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని కోరారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు ఏపీ కంటే 10% ఎక్కువగా ఉన్నారన్నారు. అయినా ఏపీకి మినహాయింపు సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది.
ఇవీ చదవండి: