Debts beyond the limit ఒకవైపు పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కేంద్రం కన్నెర్ర చేస్తోంది. ఇంతకుమించి రుణాలు తీసుకునేందుకు వీలు లేదంటూ చట్రంలో బిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో సుమారు మరో రూ.లక్ష కోట్ల రుణాలు తీసుకునేందుకు ఏకంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించడంతో విశ్రాంత ఆర్థికశాఖ అధికారులు, ఆర్థిక వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారు విస్తుపోతున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2021-22 ఏడాదిలో 4% మించి అంటే రూ.42,472 కోట్లకు మించి అప్పు చేయడానికి వీల్లేదని కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
అసలు రాష్ట్రం ఎక్కడ ఎంతెంత అప్పులు చేసిందో ఆ వివరాలు పంపాలంటూ లెక్కలు తీసుకుని నికర రుణ పరిమితిలో రూ.17,923 కోట్ల కోత పెట్టింది. అంతటితో ఆగకుండా.. కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ఎంతమేర గ్యారంటీలు ఇచ్చిందీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర గ్యారంటీలు ఇవ్వబోతోందో కూడా కేంద్రం వివరాలు సేకరించింది. అంటే కార్పొరేషన్ల రుణాల విషయంలోనూ పరిమితి దాటకూడదనే దృష్టి కోణాన్ని ప్రదర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చేందుకు ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేసింది. ఎడాపెడా మరింత అప్పులు చేసేందుకు మార్గాన్ని మరింత సుగమం చేసుకుంది. ఈ వ్యవహారం రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న అనేక మౌలికాంశాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అప్పు ఎంతో నిర్దేశించేది కేంద్రమే
రాష్ట్రప్రభుత్వం ఎంత అప్పు తీసుకోవచ్చో నిర్ణయించేది కేంద్రమే. రిజర్వుబ్యాంకు నిర్వహించే వేలంలో రాష్ట్రం పాల్గొని బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు స్వీకరిస్తుంది. ఈ పరిమితిని కేంద్రం రాష్ట్ర స్థూల ఉత్పత్తిని బట్టి లెక్కిస్తోంది. అన్ని అప్పులనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పాత అప్పులు ఎంతమేర తీర్చిందో సరిచూశాకే కేంద్రం ఈ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. కేంద్రం ఇంత కసరత్తు చేస్తూ నియంత్రిస్తుంటే ఆ పరిమితిని దాటేలా రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు కేంద్ర కసరత్తును ఫార్సుగా మార్చేస్తున్నాయని నిపుణుల వాదన.
కార్పొరేషన్ల అప్పులు దేని కోసం?
ఆంధ్రప్రదేశ్‌లో అనేక కార్పొరేషన్లు రుణాలు తీసుకుంటున్నా వాటికి ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఆ నిధులు ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు, సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఆ కార్పొరేషన్‌కు ఆదాయం ఏమీ లేనందున ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకం విధించి ఆ మొత్తాన్ని సంచిత నిధికి జమచేసి అక్కడి నుంచి కార్పొరేషన్ చెల్లించే రుణాల కోసం మళ్లిస్తోంది. ఇలా నెలకు రూ.250 కోట్ల చొప్పున 137 వాయిదాల్లో 2035 వరకు ప్రభుత్వం చెల్లిస్తూనే ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266(1) ప్రకారం భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టడంలో ప్రైమఫసీ ఉందంటూ కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసి వివరణ కోరింది.
ఈ కార్పొరేషన్ ఏర్పాటు చట్టం ఆర్టికల్ 293 (3)కి విరుద్ధంగా ఉందంటూ వివరణ కోరింది. తాజాగా అదే చేయూత, ఆసరా, అమ్మఒడికి బెవరేజస్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుని వినియోగించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ రుణం తీర్చేందుకు మళ్లీ ప్రభుత్వమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వాటికి నిధులు ఇవ్వాల్సి వస్తోంది. అంతకుముందు బెవరేజస్ కార్పొరేషన్ చేసే మద్యం వ్యాపారంపై ఆదాయపు పన్ను చెల్లించాలంటూ ఆ శాఖ తాఖీదు పంపి, న్యాయస్థానానికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం ఐఎంఎఫ్‌ఎల్ 1993 చట్టానికి 2012లో సవరణ చేసింది. చట్టం 5/2012 ప్రకారం.. 4ఎ, 4బి, 4సి సెక్షన్లు జతచేశారు. దాని ప్రకారం బెవరేజస్ కార్పొరేషన్ పన్ను, సెస్, మార్జిన్, అదనపు మార్జిన్ ఏది విధించినా అదంతా రాష్ట్రప్రభుత్వ ఆదాయమే తప్ప కంపెనీ ఆదాయం కాదని చట్టం చేశారు. ఈ పరిస్థితుల్లో బెవరేజస్ కార్పొరేషన్ రుణానికి చేసే చెల్లింపులు ప్రభుత్వ ఆదాయం కిందకు రావా అన్న ప్రశ్న తలెత్తుతో]ది.
కేంద్రానికి వేడి..
రాష్ట్రప్రభుత్వం తీసుకునే అనేక అప్పులకు కేంద్రానిదే బాధ్యత. అనేక విదేశీ ఆర్థికసంస్థలు ఇప్పటికే ఏపీ అప్పులు తీర్చట్లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖను సంప్రదిస్తున్నాయి. ఈ రుణాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడితే ఆ బాధ్యత కేంద్రంపై ఉంటుందని నిపుణుల వాదన.
ఇదీ చదవండి: Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు