సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై సీఎం జగన్ చర్చిస్తున్నారని..సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంబులెన్స్‌ల వ్యవహారంలో సంయమనం పాటిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టు చెప్పినా అంబులెన్సులు ఆపుతున్నారని…దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
మానవత్వంతో చూడండి:
రాష్ట్ర రోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారని…ఎక్కడా లేని సమస్య హైదరాబాద్ విషయంలోనే తలెత్తుతోందని సజ్జల అన్నారు. అడ్డగోలుగా విభజన చేసి వసతులు లేని ప్రాంతాలను ఏపీకి ఇచ్చారని మండిపడ్డారు. ఇటువంటి సమయంలో మానవత్వంతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అంబులెన్సులను అనుమతించాలని తెలంగాణను కోరామన్న సజ్జల…అధికారుల స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి దాటిపోయిందన్నారు. అంబులెన్స్ ల అంశంపై సుప్రీంకోర్టు కూడా విచారిస్తోందని సజ్జల వివరించారు. ఆవేశాలు పెంచి…సరిహద్దుల వివాదంగా సృష్టించవద్దన్నారు. అందరూ సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పువచ్చే వరకు అంబులెన్స్‌లను అనుమతించాలని కోరారు.
ఇదీ చదవండి