గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకొన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం రానున్న ఫిబ్రవరి పదో తేదీతో పూర్తి కానుంది. చట్టప్రకారం ఆ గడువుకు మూణ్నెళ్ల ముందు నుంచి అంటే నవంబర్ 11వ తేదీ తర్వాత ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 2016 బల్దియా ఎన్నికలకు సంబంధించిన వార్డుల పునర్విభజననే రానున్న ఎన్నికల్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అటు ఇటీవలి జీహెచ్ఎంసీ చట్టసవరణ ప్రకారం వార్డుల వారీ రిజర్వేషన్లు రెండు దఫాలు ఒకటే ఉంటాయని, గత ఎన్నికల రిజర్వేషన్లే రానున్న ఎన్నికల్లో కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వుల ప్రతిని పురపాలకశాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ పూర్తైందనే చెప్పుకోవచ్చు.
ఈ నెల 7న ఓటర్ల జాబితా ముసాయిదా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం 2021 ఫిబ్రవరితో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ సన్నద్ధత, విజ్ఞప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి ఒకటి అర్హతా తేదీతో శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. ప్రక్రియలో భాగంగా ఈ నెల ఏడో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించి 13వ తేదీన తుదిజాబితాలు ప్రకటిస్తారు. తుది జాబితాలు ప్రకటించాక కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు జాబితాలో చేర్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ సన్నద్ధతను బట్టి..
ఈ నెల 13వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించాక రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను చేపడుతుంది. అందుకు కూడా షెడ్యూల్ ప్రకటించి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తోంది. ఈ ప్రక్రియ నవంబర్ నెలాఖరులోపు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తైతే ఇక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైనట్లే. అంటే డిసెంబర్ నెల నుంచి ఎపుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ సహా ఇతరత్రా ఏర్పాట్లన్నింటినీ ఎస్ఈసీ పూర్తి చేస్తుంది. ఇక ప్రభుత్వ సన్నద్ధతను బట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సర్కార్ సన్నద్ధత ఆధారంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మిగతా ఏర్పాట్లను చేస్తుంది.
ఇవీ చూడండి: