ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కళావతి. ప్రత్యేక విభాగం కింద ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. రాష్ట్రస్థాయిలో అవార్డును సొంతం చేసుకోవడం వెనక ఆమె పడిన శ్రమ, సృజనాత్మకత, బోధనలో ప్రత్యేకత ఇలా ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. పోచమ్మగడ్డ తండా పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వెళ్లినప్పుడు సర్కారు బడికి ఒక్క విద్యార్థి వచ్చేవాళ్లు. ఈ పరిస్థితి మార్చాలని భావించిన ఆమె ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. తనదైన ప్రత్యేక శైలీలో పాఠాలు బోధించే వాళ్లు. దీంతో ఆ బళ్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 26కు చేరుకుంది. ఆమె బొమ్మల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతారు. కుందేలు, మొసలి, కోతి, నెమలి, ఎద్దు, ఎలుగుబంటి ఇలా సుమారు 50 రకాల బొమ్మల్ని ఆమె బోధన కోసం సిద్ధం చేసుకున్నారు.
పిల్లలకు అర్థమయ్యేలా..
ఐదో తరగతి వరకూ ఏ సబ్జెక్టయినా సరే ఆ బొమ్మల్ని ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు. పాఠం ముగిశాక పిల్లలు ఆ బొమ్మలతో ఆడుతూ చదువు నేర్చుకుంటారు. అందుకే అక్కడి పిల్లలకు చదువంటే అనాసక్తి అస్సలు ఉండదు. విద్యార్థులకు చదువు చెప్పేందుకు ఆమె తయారు చేసిన బొమ్మలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర జౌళీశాఖ ఆధ్వర్యంలో జరిగే జాతీయ బొమ్మల ప్రదర్శనలో 5 విభాగాల్లోని 5 బొమ్మలు జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. తెలంగాణ నుంచి 21 బొమ్మలు ఎంపికైతే అందులో ఐదు కళావతివే కావడం విశేషం. తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సైతం పోచమ్మగడ్డ తండా పాఠశాల మాత్రమే.
గోడల్నే పుస్తకంగా..
కొవిడ్ వల్ల బళ్లు మూతపడిన సమయంలో కళావతి ఉపాధ్యాయ వృత్తిలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. నేర్చుకున్న చదువు పిల్లలు మరిచిపోకుండా ఉండేందుకు, ఇంట్లో ఉన్నా సరే పాఠాలు కొనసాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యార్ధుల ఇంటి గోడల్నే పుస్తకంగా మార్చేశారు. ఇంటి గోడలపై నిలిచి ఉండేలా తెలుగు, ఆంగ్ల అక్షరమాల, ఒత్తులు, గుణింతాలు, అంకెలు, సంఖ్యలు, ఎక్కాలు ఇలాంటివి సొంత ఖర్చులతో రాయించారు. గోడలపై రాసేందుకు వీలులేని వారికి ఫ్లెక్సీలపై రాయించి అందించారు. పెద్దపిల్లలు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేలా ప్రోత్సహించారు. ఓవైపు ఆన్లైన్ తరగతులు వింటూనే వాటిని మరచిపోకుండా ఏర్పాట్లు చేశారు. ఇక ఏబీసీడీలు, అ,ఆలు, ఒకటి రెండ్లతో పాఠశాల ఆవరణలోనే వాక్, జంప్ ఆటలతో పెయిటింగ్ వేయించారు. ఆన్లైన్ తరగతుల తర్వాత ఆట విడుపు కోసం పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు.. ఆటలు ఆడుకోవడం ద్వారా వాటిని నేర్చుకునే వాళ్లు. కొవిడ్ మహమ్మారి పంజా విప్పిన వేళ విద్యార్థులకు చదువుపై ఆసక్తి సన్నగిల్లకుండా కళావతి చేసిన ప్రయత్నాల్ని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశంసించారు.
అత్యంత సులువుగా నేర్చుకునేలా..
నేర్చుకోవడాన్ని పిల్లలు ఆనందంగా భావించాలన్నది తన ఉద్దేశమంటారు కళావతి. అందుకే పిల్లలకు అత్యంత సులువుగా బోధనా రీతులను అమలు చేస్తున్నానని చెప్పారు. అవార్డు తన బాధ్యతను పెంచిందన్న ఆమె.. భవిష్యత్లో మరిన్ని కొత్త, సులభమైన బోధనా రీతులను కనిపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో కళావతి సేవలు గుర్తింపు పొందడం వల్ల జిల్లా విద్యాశాఖ అధికారులు సహా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: BADHWEL BY ELECTIONS: దీపావళి తర్వాతే బద్వేలు ఉప ఎన్నిక