నిస్వార్థంగా సేవ చేస్తే.. ఏ అధికారైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారనే దానికి నిలువెత్తు నిదర్శనం ఐఎఫ్‌ఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాష్ట్రాలను గడగడలాడించిన స్మగ్లర్, నరహంతకుడైన వీరప్పన్‌ను వీరోచితంగా ఎదుర్కొని నేలకొరిగిన శ్రీనివాస్.. 1954 సెప్టెంబరు 12న రాజమహేంద్రవరంలో అనంతరావు, జయలక్ష్మి దంపతులకు జన్మించారు. 1979లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికై కర్ణాటకలో నియమితులయ్యారు. 1986లో ఆయన వీరప్పన్‌ను వీరోచితంగా బంధించి బెంగళూరుకు తరలించారు. కొన్నాళ్లకు అనూహ్యంగా అతడు తప్పించుకుపోయాడు. తన దారికి అడ్డొస్తున్న శ్రీనివాస్‌ను మట్టుబెట్టాలని వీరప్పన్ అనేక ప్రయత్నాలు చేశాడు. చివరకు లొంగిపోతానని నమ్మించి 1991 నవంబరు 9న తనవద్దకు రప్పించుకున్నాడు. అతడి మాటలు నమ్మి శ్రీనివాస్ ఒంటరిగానే వెళ్లారు. నిరాయుధుడైన ఆయనను వీరప్పన్ కాల్చి చంపి తల నరికి గ్రామంలో వేలాడదీశాడు.
మరణానంతరం ‘కీర్తిచక్ర’ పురస్కారం
కేంద్ర ప్రభుత్వం 1992లో శ్రీనివాస్‌కు మరణానంతరం ‘కీర్తిచక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథంలోని దేవస్థానంలో మరియమ్మన్‌తోపాటు గ్రామస్థులు ఆయన పటం ఉంచి పూజలు చేస్తున్నారు. అక్కడే ఈనెల 11న శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆయన స్మారక స్తూపాన్ని నిర్మించింది. అటవీశాఖ అతిథి గృహానికి ఆయన పేరు పెట్టింది. శ్రీనివాస్ స్మారకంగా ఓ ప్రదర్శనశాలను నెలకొల్పింది.. ఆయన వినియోగించిన వాహనాన్ని భద్రపరచింది. ప్రజల్లో, ప్రభుత్వంలో ఇంతటి గుర్తింపు పొందడానికి ఆయన కోట్లాది రూపాయలేమీ ఖర్చుపెట్టలేదు. గ్రామంలో ఓ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్యం, తాగునీటి వ్యవస్థ, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయించారు. విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశారు. వీటన్నింటితో గ్రామ పరిస్థితి మారిపోయింది. అనేకమంది వేటగాళ్లు, స్మగ్లర్లు ఆ వృత్తుల నుంచి బయటపడ్డారు. నరహంతకుడైన వీరప్పన్ సొంతూరులో శ్రీనివాస్ సంపాదించుకున్న ఘన కీర్తి ఇది. ఎట్టకేలకు 2004లో వీరప్పన్ హతమైనప్పుడు గోపీనాథంవాసులు పండగ చేసుకున్నారు.
ఇవీ చదవండి: