Janmashtami 2022: ‘చేత వెన్నముద్ద.. చెంగల్వ పూదండ.. బంగరుమొలతాడు పట్టుదట్టి.. సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు.. చిన్ని కృష్టా నిన్ను చేరికొలుతు’ ఈ ఆటవెలది పలకని తెలుగువాళ్లుండరు. విశ్వ సృజన కర్త అయిన మాధవుడికి జననం ఒక ఆటవిడుపు. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు తన లీలా విలాస ప్రదర్శనకు ముందుగానే చేసుకున్న ఏర్పాట్లు. జీవన సమరంలో మనకెదురయ్యే సందేహాలకు సమాధానం శ్రీకృష్ణావతారం.
Sri Krishna janmashtami 2022: నేస్తాలతో ఆటపాటలు, గోపికలతో దుడుకు చేష్టలు, పూతన తదితర రాక్షస సంహారం, కాళీయుని మదమణచడం.. వంటి చిత్రవిచిత్ర పనులతో బాల్యాన్ని ఆస్వాదించిన నందగోకుల విహారి శ్రీహరి.
శ్రీకృష్ణ నామాన్ని స్మరించడమంటే అమృతాన్ని ఆస్వాదించడమే. ఆ దేవదేవుడి స్వరూపం అంతకంటే మధురం. అందుకే విశ్వమోహనుడి సుందర స్వరూపాన్ని దర్శించాలని దేవతలూ, రుషులూ శక్తికొద్దీ యత్నించారు. కానీ ఎవరికైనా దొరికాడా ఆ వెన్నదొంగ!
చిక్కడు సిరికౌగిటిలో, జిక్కడు సనకాది యోగిచిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతి లతికావళి, జిక్కె నతడు లీల దల్లిచేతన్ రోలన్
శ్రీ మహాలక్ష్మి కౌగిటికీ చిక్కనివాడు, సనకాది మునీంద్రుల చిత్తంలోనూ స్థిరంగా నిలవనివాడు, వేదాలు చదివినా అర్థం కానివాడు.. ఆశ్చర్యంగా తల్లి యశోద చేతికి చిక్కి రోలుకు బంధితుడయ్యాడు. ఆహా..! అమ్మ ప్రేమ మాధుర్యానికి అంతర్యామి అయినా తలవంచక తప్పదనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది? మన్ను తిన్న నోట్లోనే మిన్నును, మొత్తం అంతరిక్షాన్ని ఇముడ్చుకున్న బృందావన సంచారి ఆ శిఖిపింఛ మౌళి.
సుమధుర వాత్సల్యం.. మనం మాయాబంధితులం. కష్టాల కార్చిచ్చు జీవితాన్ని దహించేయడానికి సదా సిద్ధంగా ఉంటుంది. తప్పించుకునే తరుణోపాయం కోసం అన్వేషిస్తే నల్లనయ్య చల్లని కృపకు పాత్రులం కావడమేనని అర్థమవుతుంది. కన్నయ్య గొప్ప యోగి. అడవిలో చెలరేగిన దావానలాన్ని మింగి గోవులను, గోప బాలకులను రక్షించిన మహిమా సంపన్నుడు. ఆ యోగ బలాన్ని ప్రత్యక్షంగా దర్శించిన గోపాలకులు ‘ఈ బాలుడు బ్రహ్మో, విష్ణువో శివుడో అయ్యుంటాడే గానీ సామాన్యుడు కాడు’ అనుకున్నారు. అరణ్యంలో పుట్టిన దావాగ్నిని అవలీలగా అణచేసిన ఆ యోగిపుంగవుడికి భక్తుల్ని కష్టాల కార్చిచ్చు నుంచి బయటపడేయడం శ్రమ కాదు. మనుషులకే తప్ప సృష్టికర్తకు రాగద్వేగాలుండవు. నిప్పులాంటి స్వచ్ఛత పరమాత్మ తత్వం.
చెదలవంటి వైషమ్యం అంటితే దేవుడెలా అవుతాడు? కృష్ణుడు పరమాత్ముడని రుజువు చేస్తుంది భాగవతం. గోపికలు కాంక్షతో సేవించారు. కంసుడు ప్రాణభయంతో తలచుకున్నాడు. కృష్ణుణ్ణి ఎలా కష్టపెట్టాలన్నదే శిశుపాలుడి నిరంతర ఆలోచన. యాదవులంతా బంధుప్రీతితో స్మరిస్తే, పాండవులేమో స్నేహభావంతో మెలిగేవారు. ఎవరు ఎలాంటి భావంతో తలచుకున్నా అందరికీ మోక్షాన్ని అనుగ్రహించాడంటే ఆ సర్వేశ్వరుడి వాత్సల్యం ఎంతటిదో! మోక్ష పథగాములకు ఆయన శ్రీ చరణ సన్నుతి తప్ప అన్య గతి లేదు. భాగవతం మరో రహస్యాన్ని కూడా బోధిస్తుంది. ఆ కథలను వింటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడే శ్రవణేంద్రియాల ద్వారా హృదయపద్మంలోకి ప్రవేశిస్తాడు. శరదృతువు వచ్చే వేళకు నదిలో మాలిన్యమంతా అడుగుకు చేరి స్వచ్ఛమైన నీరు పైకి తేలినట్లు కన్నయ్యను మనసులో నిలిపితే దోష భావాలన్నీ అడుగంటిపోతాయి. ఇక ఆ మహితాత్ముడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. మాటల్లో సత్యం ప్రతిష్ఠితమవుతుంది. చేతల్లో స్థిరత్వం ప్రతిపాదితమవుతుంది. కృష్ణ భగవానుడి అనుచరులం అనిపించేలా వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. అందుకే అనునిత్యం కృష్ణుణ్ణి స్మరించమంటారు పెద్దలు. తెలిసీ తెలియక చేసిన పాపాలు కృష్ణ నామస్మరణతో నశిస్తాయంటోంది స్కాంద పురాణం. కుచేలుడిపై కృష్ణుడు చూపిన స్నేహమాధుర్యం అందుకు సాక్ష్యం. అర్జునుడితో సాగించిన నర నారాయణ సంబంధం ఆత్మ స్వరూపులమైన మనతో ఆ పరమాత్మ చుట్టరికాన్ని కూడా కలపగలడని అవగతమవుతుంది.
ఆయుధం పట్టని వీరుడు.. కురుక్షేత్ర యుద్ధంలో గోపాలుడు ఆయుధాన్ని చేపట్టలేదు. యుద్ధం గెలవడానికి మాత్రం కారణమతడే. యుద్ధ విముఖుడై వెనుదిరిగిన పార్థుణ్ణి ముందుకు నడిపిన బోధ.. అదే భగవద్గీత. సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు పాండవ సైన్య శ్రేణిని ఊచకోత కోస్తుంటే భీష్ముణ్ణి సంహరించడానికి ధర్మరాజుతో సగం అబద్ధం పలికించినప్పుడు సకల వేదవేత్త అయిన ఆ కృష్ణ పరమాత్మ అసలైన రాజకీయవేత్తలా అనిపిస్తాడు. ప్రత్యక్షంగా కనిపించకున్నా జీవితాన్ని ఎంత అందంగా మలచుకోవాలో తెలియజేసిన ఆ మాధవుడే మన గురువు. ఆ మహితాత్ముడే మన ధైర్యం. ఆ మహనీయుడే మన సైన్యం. కనుకనే కృష్ణుడి జన్మదినం పర్వదినం, విశ్వ కల్యాణ కారకం.
ఇవీ చదవండి : అనుచరుల కోసం గంటకుపైగా ఆలయంలోనే మంత్రి రోజా