కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం.. మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక ఉత్కృష్ట సేవాయజ్ఞం.. ఆత్మీయుడిని కోల్పోయిన పెనువిషాదంలో ఉన్నప్పటికీ అతడి అవయవ దానానికి ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్న కుటుంబీకుల సేవాస్ఫూర్తి మహోన్నతం.. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి నిత్య చేతనంగా నిలుస్తాయన్న భావనే వారి కార్యశీలతలోని నిగూఢార్థం.. ఒకరికి గుండె, ఒకరికి ఊపిరితిత్తులు, మరొకరికి కళ్లు, ఇంకొకరికి మరో అవయవం.. ఇలా అవయవాల కోసం నిరీక్షిస్తున్న ఆపన్నులెందరో!
వారి అవసరాలను తీర్చేందుకు ‘జీవన్‌దాన్’ అనుసంధానకర్తగా నిలుస్తోంది. అవయవ దానమంటే ఉన్న భయం, అపోహలను తొలగిస్తోంది. కరోనా విజృంభించిన గతేడాది కూడా అవయవదాన ప్రక్రియను విజయవంతంగా కొనసాగించింది. ఇది మరింత పుంజుకొని ఈ ఏడాది ఒక్క నెలలోనే 24 అవయవదాన శస్త్రచికిత్సలు జరిగాయి. యువత సైతం పుట్టిన రోజు, పెళ్లిరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో అవయవ దాతలుగా పేరు నమోదు చేసుకుంటున్నారు.
సైబరాబాద్ పోలీసుల ‘మరో జన్మ’
అవయవదాన ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘మరోజన్మ’ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 18న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవలే జీవన్మృతుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు అవయవదానంతో మరో 8మందికి ప్రాణం పోశారు. పోలీసుల ‘మరో జన్మ’ జీవన్‌దాన్‌కు ఊతమిచ్చింది.
ఐదిళ్లలో కొత్త వెలుగు
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండకు చెందిన గండ్రాతి సమ్మయ్య, శ్రీలతల కుమారుడు రేవంత్(23). ద్విచక్రవాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాక్టర్ ఢీకొని తలకు గాయాలయ్యాయి. బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. జీవన్‌దాన్ చొరవతో కుటుంబీకులు తమ బిడ్డ శరీరం నుంచి గుండె, కాలేయం, పాంక్రియాస్, మూత్రపిండాల దానానికి అంగీకరించారు. వాటిని ఐదుగురికి అమర్చారు.
ఆగిపోతున్న గుండెకు ఆయువునిచ్చి..
హృదయ సంబంధ రోగంతో బాధపడుతున్న ఒకరికి జీవన్మృతుడైన నర్సిరెడ్డి (45) గుండెనిచ్చి ప్రాణం పోశారు. ప్రపంచంలో తొలిసారి ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మెట్రో రైలులో గుండె తరలించి హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందింది. నర్సిరెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెం గ్రామం. బోరుడ్రిల్లర్‌గా పనిచేసే ఆయన అధిక రక్తపోటుతో బాధపడుతూ ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి వచ్చారు. కొద్ది రోజులకే జీవన్మృతుడయ్యారు. గుండెను మెట్రో రైలులో జూబ్లీహిల్స్ అపోలోకు, మిగిలిన అవయవాలను గ్రీన్‌ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని ఇతర ఆసుపత్రులకు పంపించారు.
అభినిత.. ముగ్గురికి ప్రాణదాత
తమ గారాలపట్టి తమను వీడిపోయినా మరో ముగ్గురిలో బతికుందని అభినిత తల్లిదండ్రులు నమ్ముతున్నారు. హన్మకొండకు చెందిన చేర్యాల చంద్రశేఖర్, కృష్ణవేణి దంపతుల పిల్లలు అభినిత, అభినవ్. బీటెక్ విద్యార్థిని అభినిత స్నేహితులను కలిసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలై జీవన్మృతురాలయింది. ఆమె తల్లిదండ్రుల సమ్మతితో అభినిత మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల్ని ప్రాణాపాయంలో ఉన్న మరో ముగ్గురికి అమర్చారు.
కొవిడ్ తర్వాత మరింత పుంజుకుంది
'అవయవదానంపై ప్రజల్లో అవగాహన వచ్చింది. ఆన్‌లైన్, ఇతర వేదికల ఆధారంగా జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుంటున్నారు. కొవిడ్-19 నుంచి కొంత కుదుటపడ్డాక ఇప్పుడిప్పుడే దాతల సంఖ్య పెరుగుతోంది.'
- డాక్టర్ స్వర్ణలత, తెలంగాణ జీవన్‌దాన్ సమన్వయకర్త
ఇదీ చదవండి: