ఎక్కడైనా ఇల్లు కట్టేముందు ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు ఉన్నాయా? భవనం కడితే పునాదులు గట్టిగా ఉంటాయా? అని పరీక్షిస్తారు. కానీ, జర్మనీలో బాంబులు ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. విచిత్రంగా ఉంది కదా! కొన్ని దశాబ్దాలుగా జర్మనీలోని అనేక నగరాల్లో టన్నుల కొద్దీ పేలని బాంబులు బయటపడుతున్నాయి. వాటిని గుర్తించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఆ తర్వాత బాంబులును నిర్వీర్యం చేస్తున్నారు. దీని వెనుక కథేంటో తెలుసుకోవాలంటే రెండో ప్రపంచయుద్ధం కాలానికి వెళ్లాల్సిందే.
రెండో ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ నుంచి 1945 సెప్టెంబర్ మధ్య జరిగింది. బ్రిటన్, అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ కలిసి మిత్ర రాజ్యాల కూటమిగా.. జర్మనీ, జపాన్, ఇటలీ కలిసి అక్ష రాజ్యాల కూటమిగా ఏర్పడి యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ క్రమంలో మిత్ర రాజ్యాలకు చెందిన సైన్యం జర్మనీపై బాంబుల వర్షం కురిపించింది. జర్మనీ వ్యాప్తంగా పడిన ఆ బాంబుల బరువు లక్షల టన్నులు ఉంటాయని అంచనా. అయితే అందులో దాదాపు 10 శాతం బాంబులు యాక్టివ్‌గానే ఉన్నా పేలలేదు. కాలక్రమంలో ఆ బాంబులు భూమి లోపలకు కుంగిపోయాయి. అప్పటి నుంచి భారీ వర్షాలు పడినప్పుడు.. ఇళ్ల నిర్మాణం కోసం భూమిని తవ్వినప్పుడు ఆ బాంబులు బయటపడుతున్నాయి. అలా జర్మన్ అధికారులు ఏటా దాదాపు రెండు వేల టన్నుల బాంబులను గుర్తిస్తున్నారట.
ఆ దేశంలో ఏ భవన నిర్మాణ సంస్థ అయినా ఇళ్ల నిర్మాణం చేపట్టేముందు ప్రభుత్వ సాయంతో భూమిని జాగ్రత్తగా తవ్వి బాంబులు ఉన్నాయో లేవో పరిశీలిస్తుంది. బాంబులు బయటపడితే స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వాటిని అధికారులు నిర్వీర్యం చేస్తున్నారు. 2017 ఆగస్టులో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలోని ఓ భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో 1800 కిలోల బాంబులను గుర్తించారు. దీంతో 70 వేల మంది స్థానికులను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీలో జరిగిన అతిపెద్ద మానవుల తరలింపు కార్యక్రమం ఇదేనట.
ఈ ఏడాది జనవరిలో డోర్ట్‌మండ్ నగరంలో 250 కిలోల బాంబు బయటపడింది. గత నెల 5న ఇదే నగరంలో మరో 500 కిలోల బాంబును గుర్తించారు. దీంతో 2,700 మంది స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. జూన్ 13న జర్మనీలోని హామ్‌బర్గ్‌లో భారీ బాంబును గుర్తించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేశారు. ఇలా రెండో ప్రపంచయుద్ధం జరిగి 75 ఏళ్లు గడిచినా.. జర్మనీలో బాంబులు బయటపడుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి :