హైదరాబాద్ జంటనగరాల్లో ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగంగా పూర్తి చేయనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 4,846 కాలనీలు, బస్తీలతో పాటు కంటోన్మెంట్‌లోని 360 బస్తీలు, కాలనీల్లో డ్రైవ్ కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 175 సంచార వ్యాక్సిన్ వాహనాలను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది బస్తీలు, కాలనీల్లోకి టీకా వేయనున్నారు. గ్రేటర్‌లో ఇప్పటికే 70 శాతానికి పైగా అర్హులైన 18 ఏళ్ల పైబడినవారికి వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇంకా టీకా తీసుకోని వారిని గుర్తించి 100 శాతం వ్యాక్సిన్ ఇప్పించేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కంటోన్మెంట్ పరిధిలోనూ మరో 25 వాహనాలను సిద్ధం చేశారు. సుమారు 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
కరపత్రాల పంపణీ, బ్యానర్ల ప్రదర్శన...
జీహెచ్ఎంసీ, ఆశా, అంగన్‌వాడి ఎంటమాలజీ విభాగాలకు చెందిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలు సేకరించి.... ఆరోగ్య సిబ్బందికి అందిస్తారు. వ్యాక్సిన్ వాహనాలు ఎప్పుడు ఏ ప్రాంతానికి ఏ సమయంలో వస్తాయనే వివరాలతో కూడిన కరపత్రాలను.... ఆయా కాలనీలు, బస్తీల్లో పంపిణీ చేస్తారు. 100 శాతం వ్యాక్సిన్ పూర్తయిన కాలనీలు, బస్తీలకు తమ ప్రాంతంలో 100 శాతం వ్యాక్సిన్ పూర్తయినట్టు బ్యానర్‌ను ప్రదర్శిస్తారు.
ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా..
ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్ని... జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి లు తనిఖీలు చేస్తారు. ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగం చేయాలని సీఎస్ కోరారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
ఇదీచూడండి: