బహిరంగ ప్రదేశాల్లో కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఎవరు బయటికొచ్చినా మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాల నిర్వాహకులకు తాఖీదులిచ్చి దుకాణం మూసివేయించాలని సూచించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు.
18 నుంచి 22 వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు
ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రతి కుటుంబానికి వాలంటీర్లతో ఉచితంగా మాస్కులు పంపిణీ చేయించాలని అధికారులను పురపాలక శాఖ ఆదేశించింది. వాలంటీర్లతో పాటు స్వయం, సహాయక సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్దేశించింది. గతంలో సూచించిన సమయాల్లో మాత్రమే దుకాణాలు తెరవాలని కోరింది. కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణాదారులదేనని స్పష్టం చేసింది. శానిటైజర్ అందుబాటులో ఉంచడం సహా... రద్దీ ఉన్న చోట థర్మల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా.. ఈనెల 18 నుంచి 22 వరకు అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
ప్రైవేట్ కార్మికుల సేవలు మరో మూణ్నెళ్లు పొడిగింపు
నిర్మాణ ప్రదేశాల్లో గుట్కా, తంబాకు, పాన్ వినియోగంపై నిషేధం అమలు చేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలను 14 రోజులపాటు గృహ పర్యవేక్షణలో ఉంచిన తరువాతే పనికి అనుమతించాలని సూచించింది. పని ప్రదేశంలో మాస్కులు ధరించడం తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశించింది. తమ పరిధిలోని పనిప్రదేశాలను అధికారులు నిత్యం పర్యవేక్షించి... కమిషనర్లకు నివేదిక ఇవ్వాలని కోరింది. కొవిడ్ నేపథ్యంలో అదనపు అవసరాల కోసం ఇప్పటికే పనిచేస్తున్న ప్రైవేట్ కార్మికుల సేవలను పుర, నగరపాలక సంస్థలు మరో మూణ్నెళ్ల పాటు వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
ఇదీ చదవండి : 'చెన్నై, కోల్‌కతా కేంద్రంగా మానవ అక్రమ రవాణా'