సభాపతిగా ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన అసెంబ్లీలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘పాలనా వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉందంటూ కొందరు న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సెలక్ట్ కమిటీని ఏర్పాటే చేయలేదు. ఉనికిలో లేని కమిటీ వద్ద బిల్లు ఎలా పెండింగులో ఉంటుంద’ని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీ పెండింగ్‌పై న్యాయస్థానమిచ్చే తీర్పును పాటిస్తారా అని విలేకరులు అడగ్గా.. ‘తీర్పు రానివ్వండి. అప్పుడు స్పీకర్ పవర్స్ ఏంటో చూపిద్దాం. ఇప్పుడు నేనేం మాట్లాడినా తొందరపడినట్లు అవుతుంద’ని వ్యాఖ్యానించారు. శాసన వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, పార్లమెంట్, శాసనసభల్లో తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు.
పదో షెడ్యూలుతో పాటు న్యాయవ్యవస్థపై సమీక్షకు ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. అఖిల భారత సభాపతుల సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన రాష్ట్రంలో నిర్వహించాలని ఆలోచిస్తున్నామని, సీఎంతో చర్చించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ‘అమరావతిలో రాజధానిని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ సమర్థించారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వికేంద్రీకరణ వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింద’ంటూ వైకాపా మేనిఫెస్టోను స్పీకర్ ప్రదర్శించారు. తెదేపా ఎమ్మెల్యేల్లో కొందరు వేరుగా కూర్చోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘నాకు సభలో పలానా చోట సీటు కేటాయించండి అని ఓ సభ్యుడు కోరినపుడు కేటాయించాల్సిన బాధ్యత సభాపతిగా నాపై ఉంది. అదే చేశా’నని చెప్పారు. ఇదే విధానం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్‌సభలో వర్తిస్తుందా అని అడగ్గా అది పార్లమెంటు వ్యవహారమని సమాధానమిచ్చారు. ఈ ఏడాది కాలంలో శాసనసభలో 56 బిల్లులు ఆమోదించామని, సభాపతిగా తనకు సంతృప్తినిచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్