కొవిడ్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతుండడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం 10 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజాగా జులై 1 నుంచి వాటికి అదనంగా మరో 45 సర్వీసులను పెంచడానికి ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బోర్డు అనుమతి మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు.
జులై 1నుంచి అదనంగా నడపనున్న 45 ఎంఎంటీఎస్ రైళ్లలో ఫలక్నుమా-లింగంపల్లి-రామచంద్రాపురం మార్గంలో 13, లింగంపల్లి- రామచంద్రాపురం-ఫలక్నుమా మార్గంలో 12, హైదరాబాద్-లింగపల్లి రూట్లో 10, లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 10 చొప్పున సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.