ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం భాజాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు వర్ణనాతీతమన్న సోము వీర్రాజు.. ఇక్కడ పొలాలు ఉండి దేశవ్యాప్తంగా వలసలకు వెళ్తున్నారన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి వనరులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆయన.. ఎంతసేపూ పోలవరం మాటే ప్రస్తావిస్తారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులపై.. భాజపా పోరాటం చేస్తోందన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో ప్రాజెక్టులపై ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రికి ఏమైనా ఇబ్బంది ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖను రద్దు చేయాలని డిమాండ్ చేసిన సోము వీర్రాజు.. రైతులను, ఆ శాఖ మోసం చేస్తోందన్నారు. ధాన్యాన్ని దళారులు, మిల్లర్లే కొంటున్నారన్నారు. మిల్లరే పౌరసరఫరాలశాఖ ఛైర్మన్ అని ఎద్దేవా చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: BJP Leader Murder: అర్థరాత్రి భాజపా నేత అదృశ్యం.. ఉదయం మామిడితోటలో మృతదేహం