Somu Veerraju: రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. భాజపా ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి పరిధిలో ఉన్న ప్రైవేటు యూనిర్శిటీలకు రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనను ఆయన ఇవాళ పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్ధులు వచ్చి ఇక్కడ చదువుతున్నారన్న కనీస స్పృహ లేకుండా.. ప్రభుత్వం వ్యవహరిస్తోందని వీర్రాజు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ యాజమాన్యాలపైన కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. మౌలిక వసతుల కల్పనపై ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం తోలు మందంతో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. విశాఖపట్నంలో జగన్ ఏం చేశారో చెప్పాలని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. రాజధాని రైతుల పోరాటానికి భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎయిమ్స్‌ను పరిశీలించిన సోము వీర్రాజు: మంగళగిరి ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాలను సోము వీర్రాజు పరిశీలించారు. నీటి సమస్యపై ఎయిమ్స్ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏపీపై అభిమానంతో మోదీ ప్రభుత్వం ఎయిమ్స్‌ను వెంటనే మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యుత్, నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఎద్దేవా చేశారు. తాత్కాలికంగా నీటి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. శాశ్వత నీటి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నీరు ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: