గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో(జీపీఎస్) పనిచేసే ఒప్పంద గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్టీ) సర్వీసు పునరుద్ధరణలో విపరీత జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది మే నెలలోనే రెన్యువల్ పూర్తవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 1,798 మంది ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. రెన్యువల్‌కు సంబంధించిన దస్త్రం దాదాపు రెండు నెలలుగా ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జీతాల్లేక అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
విద్యార్ధుల చదువులకు ఇబ్బంది..
అక్టోబరు వచ్చినా సర్వీసు పునరుద్ధరణపై స్పష్టత లేక.. విధుల్లో కొనసాగిస్తారో లేదోనన్న సందేహంతో కొందరు విధులకు హాజరవ్వడం లేదు. ఫలితంగా ఐటీడీఏల్లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం తరగతులు నిలిచిపోయినట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోనే పదుల సంఖ్యలో బడుల్లో తరగతులు జరగలేదు. దసరా సెలవులకు ముందు కూడా దాదాపు వారం పాటు తరగతులు జరగలేదు. గిరిజన సంక్షేమ శాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో 1,903 జీపీఎస్‌లు నిర్వహిస్తోంది. వీటిలో 358 చోట్ల సీఆర్టీలు ఒక్కరే విధుల్లో ఉంటారు. ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులకు గైర్హాజరవ్వడంతో మొత్తం తరగతులు నిలిచిపోతున్నాయి. మరోవైపు ఆశ్రమ పాఠశాలల్లోనూ సబ్జెక్టులు బోధించే సీఆర్టీలు రాకపోతే.. బోధనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకున్నా రోజుల తరబడి వివిధ పాఠ్యాంశాలు పూర్తికావడం లేదు.
పునరుద్ధరించకపోతే 25న ధర్నా...
" సీఆర్టీల సర్వీసును తక్షణమే పునరుద్ధరించాలి. ఇదే విషయంపై పలుమార్లు కలిసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సర్వీసు పునరుద్ధరించకపోతే ఈ నెల 25న విజయవాడలో ధర్నా నిర్వహిస్తాం" - టి.నూకరాజు, ఏపీ సీఆర్టీల సంఘం అధ్యక్షుడు
ఇదీ చదవండి : Inhuman: చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం..ఎవరిదీ పాపం !