SOLAR ENERGY ON HC: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నిబంధనలు, యూనిట్ టారిఫ్ ధరలను సవరించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, డిస్కంలు ఏపీఈఆర్సీని కోరడం సరికాదని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపున సీనియర్ న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. గత ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఒప్పందాలు ప్రభుత్వంతో జరుగుతాయే తప్ప, రాజకీయ పార్టీలతో కాదన్నారు.
ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానపరమైన నిర్ణయాలను మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. చట్టబద్దంగా నిర్వహించిన టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహించిన బిడ్డింగ్ తర్వాతే పీపీఏలు జరిగాయని గుర్తు చేశారు. వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. యూనిట్ ధరలను సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి లేదని వాదించారు.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థల తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. యూనిట్ ధరలను పున సమీక్షించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. పూర్తి స్థాయి వాదనల కోసం విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: