రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ పాజిటివ్ కేసుల్లో తమిళనాడు కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన 9 మందికి కరోనా సోకినట్టు తెలియచేసింది. కొత్తగా చిత్తూరులో 1, నెల్లూరులో 8 కేసులు వచ్చినట్లు పేర్కొంది.
కొత్త కేసులతో కలిపి... రాష్ట్రంలో నమోదైన కేసులు 2787కి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 10 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1913కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 816గా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలో 111 మంది కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కేసుల సంఖ్య 219 గా నమోదు అయ్యినట్లు వెల్లడించింది. వీరిలో 144 మంది డిశ్చార్జి కావటంతో ఇంకా 75 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 9664 నమూనాలు పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలియచేసింది.
ఇదీ చదవండి : దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు