తెలంగాణలో జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పుర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కమిషన్... సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న రాచకొండ సీపీ మహేష్ భగవత్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్(Disha encounter).. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగినందున అప్పటి కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ఎందుకు విచారించలేదని భగవత్‌ను కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు మహేష్ భగవత్ సమాధానమివ్వగా.. కొన్నింటికి జవాబు చెప్పలేకపోయారు. ఎదురుకాల్పుల సమయంలో గాయపడ్డ ఇద్దరు పోలీసులకు సంబంధించి చికిత్స వివరాలను సిట్ నివేదికలో ఎందుకు పొందుపర్చలేదని కమిషన్ ప్రశ్నించింది.
ఇలాగేనా కేసు డైరీ రాసేది..
అనంతరం సిట్ కేసు డైరీ రాసిన వనపర్తి ఎస్పీ అపూర్వారావును కమిషన్ విచారించింది. ఎదురు కాల్పుల సమయంలో కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌కు రక్తం వచ్చేలా గాయాలయ్యాయని చెప్పారని.. కానీ ఆస్పత్రి నివేదికలో మాత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు రక్తం వచ్చేలా గాయాలైనట్లు ఉందని ప్రశ్నించింది. అరవింద్ గౌడ్‌కు గాయాలయ్యాయని పొరపాటున అనుకున్నానని అపూర్వారావు బదులివ్వగా.. కమిషన్ సభ్యురాలు జస్టిస్ రేఖా సుందర్ బల్గోటా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు.. భద్రతను ఆశిస్తారు. యువ ఐపీఎస్ అధికారిగా ఉన్న మీరు కేసు డైరీని ఇలాగేనా రాసేది.. అని వ్యాఖ్యానించారు.
ఇదీచూడండి: DOUBLE MURDER: కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి హత్య