దిశ నిందితుల ఎన్కౌంటర్(Disha encounter case) సయమంలో ఎదురుకాల్పుల్లో గాయపడ్డ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ కుమార్‌ను ఆస్పత్రిలో చేర్పించిన సమయాలకు సంబంధించి తేడాలు ఎందుకున్నాయని కేర్ ఆస్పత్రి వైద్యుడిని సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar commission) ప్రశ్నించింది. ఆస్పత్రి రికార్డుల్లో ఓ విధంగా... అఫిడవిట్లో మరో విధంగా సమయం ఉండటాన్ని కమిషన్ ప్రస్తావించింది.
బాధితులకు వైద్యంపైనే దృష్టి పెట్టామని... సమయం నమోదును అంతగా పట్టించుకోలేదని కేర్ ఆస్పత్రి వైద్యుడు కమిషన్‌కు తెలిపారు. అంతకుముందు షాద్‌నగర్ సీహెచ్సీ వైద్యుడు నవీన్‌కుమార్‌ను కమిషన్ రెండో రోజు ప్రశ్నించింది. అరవింద్ కుమార్ భుజానికి అయిన గాయానికి సంబంధించి కమిషన్ అడిగిన ప్రశ్నలకు నవీన్‌కుమార్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు.
అరవింద్ భుజంపై అయిన గాయానికి సంబంధించి అఫడవిట్లో నమోదు చేశారని... వైద్య నివేదికలో ఎక్కడ కూడా లేదని కమిషన్ తరఫు న్యాయవాది పరమేశ్వర్ లేవనెత్తారు. కేర్ ఆస్పత్రి వైద్య నివేదిక చూసి అఫిడవిట్లో పొందుపర్చానని ఒకసారి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న కేషీట్ ప్రకారం రాశానని మరోసారి.. నవీన్ కుమార్ సమాధానం ఇచ్చాడు.
ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో సేకరించిన ఆధారాల గురించి క్లూస్ టీం అధికారి వెంకన్నను... సిర్పూర్కర్ కమిషన్ ఇదివరకు జరిగిన విచారణలో ప్రశ్నించింది. పోలీసులు జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అని వెంకన్నను కమిషన్ ఆరా తీసింది. ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి సంబంధించిన రఫ్ స్కెచ్‌ను వెంకన్న.. కమిషన్‌కు సమర్పించారు. ఘటనా స్థలంలో రఫ్ స్కెచ్ గీశారా అని కమిషన్ ప్రశ్నించగా.... అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో ఫొటోలు తీసుకొని కంప్యూటర్ ద్వారా మ్యాప్ తయారు చేశామని వెంకన్న వివరించారు.
ఇదీ చదవండి: కాలువలో కొట్టుకుపోతున్న చిన్నారులను రక్షించాడు...కానీ..