కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలోని సింగరేణి సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు గణాంకాలను గతేడాదితో పోల్చిచూస్తే వృద్ధి నమోదైందని ఆ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో 54.43 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి.. 79.11 శాతం వృద్ధిని కనబరిచిందని పేర్కొంది. ఏప్రిల్లోనే 48.56 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 61.9 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. 347 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ వెలికి తీసి 27.5 శాతం వృద్ధిని సాధించింది.
సీఎండీ హర్షం..
కరోనా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సింగరేణి కార్మికులు, అధికారులు వృద్ధి సాధించడం పట్ల ఆ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని విద్యుత్ కర్మాగారాల్లో బొగ్గు కొరత ఉండకూడదనే ఉద్దేశంతో రోజుకు దాదాపు 1.80 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేస్తున్నామన్నారు. ఏప్రిల్లో మొత్తం 940 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధించడం కోసం ఇక నుంచి రోజూ 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాతో పాటు 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను సాధించాలని సీఎండీ కోరారు.
ఇదే ఉత్సాహంతో..
మంచిర్యాల జిల్లా జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏప్రిల్లో 822.53 మిలియన్ యూనిట్ల విద్యుత్తును 98.53 శాతం పీఎల్ఎఫ్తో సాధించిందని ప్రకటించారు. ఏడాది 26 శాతం వృద్ధి నమోదవడం పట్ల సీఎండీ హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్లో మొత్తం 98.53శాతం పీఎల్ఎఫ్తో 822.94 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి.. 777.21 మిలియన్ యూనిట్లను ఆ రాష్ట్ర అవసరాలకు అందించామని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:
నలుగురు కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ అందకనే అంటున్న బంధువులు!