Shortage of ambulances: సకాలంలో విధులకు హాజరుకాని వైద్యులు, సిబ్బంది.. అంబులెన్సుల కొరత.. పనిచేయని సీసీ కెమెరాలు... రాష్ట్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), సీహెచ్‌సీలు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఇలాంటివి పలు సమస్యలు ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు గుర్తించాయి. రాష్ట్రంలోని 44 ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాలా చోట్ల వైద్యులు, సిబ్బంది హెడ్ క్వార్టర్‌లో నివాసం ఉండట్లేదని, సకాలంలో విధులకు హాజరుకావడం లేదని, వైద్యులు విధులకు గైర్హాజరైన చోట వారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మాసిస్టే ముందులు ఇస్తున్నారని గుర్తించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
విజిలెన్స్ సోదాల్లో తేలిన మరికొన్ని అంశాలివి.
* పలు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణాల్లో తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించట్లేదు. కొన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన తాగునీటి పాయింట్లు పనిచేయట్లేదు
* కొన్ని పీహెచ్‌సీల్లో తగినన్ని అంబులెన్సులు లేవు. పలు చోట్ల వాటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నా. చేయట్లేదు. వినియోగానికి పనికిరాకుండా ఉన్నాయి.
* చాలా చోట్ల బయోమెడికల్ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించట్లేదు
* యూనిఫాం, గుర్తింపు కార్డులు ధరించకుండానే వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
* కొన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.
* రోగులకు పలు చోట్ల మెనూ ప్రకారం ఆహారం అందడం లేదు
* ప్రకాశం జిల్లా ఈతముక్కల పీహెచ్‌సీ వైద్యురాలు విధులకు గైర్హాజరయ్యారు.
* టంగుటూరు పీహెచ్‌సీలో వైద్యాధికారుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మాసిస్టే మందులు ఇస్తున్నారు.
* నంద్యాల జిల్లా పాములపాడు పీహెచ్‌సీలో స్టాకు రికార్డుల్లో ఉన్న మందుల వివరాలకు, వాస్తవంగా ఉన్న మందుల నిల్వకూ మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
* పల్నాడు జిల్లాలోని ఏరియా ఆసుపత్రిల్లో వైద్యులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావట్లేదు
* నెల్లూరు జిల్లా దగదర్తి పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది యూనిఫాం ధరించడం లేదు.
ఇవీ చదవండి: