జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా ప్రాథమిక విద్యలో తీసుకొస్తున్న మార్పులు పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలపడం పేద పిల్లల చదువులపై పెనుభారం కానుంది. వారు కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు కొత్తగా ప్రీప్రైమరీ పాఠశాలల ఏర్పాటును ఆహ్వానిస్తున్నారు. 5+3+3+4 విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ బడులుగా మార్చుతారు. అంగన్‌వాడీలు వైఎస్సార్ ప్రీప్రైమరీ పాఠశాలలు అవుతాయి. సమీపంలో ఉన్న అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ప్రీప్రైమరీ-1, 2, ఒకటో తరగతికి సన్నద్ధత, ఒకటి, రెండు తరగతులను ఒకచోట నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తారు. దీంతో వారందరూ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వ బడుల్లో ఎక్కువమంది పేద పిల్లలే చదువుతారు. ప్రస్తుతం కిలోమీటరు దూరమున్న బడి కొన్నిచోట్ల 3 కి.మీ.కుపైగా దూరానికి చేరడం ప్రధానంగా బాలికల చదువుకు ఆటంకం కానుంది. వ్యయప్రయాసలకోర్చి తమ పిల్లలను అక్కడివరకు పంపడంపై తల్లిదండ్రులు పునరాలోచించే ప్రమాదమూ పొంచి ఉంటుందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పిల్లలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే కల్పించే సదుపాయాలను మాత్రం జాతీయ విద్యావిధానం అమలు ప్రతిపాదనల్లో ప్రస్తావించ లేదు.
వీటిపై ఏం చేయాలి?
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు విద్యార్థి నివాసానికి కిలోమీటరులోపే ఉన్నాయి. కొత్త విధానంలో ఇక్కడ చదివేవారు మూడింతల దూరం వెళ్లాల్సి వస్తుంది. మారుమూల గ్రామాలు, ఏజెన్సీల్లో ఎలాంటి రవాణా సదుపాయం ఉండదు. ఒకవేళ ఆటోల్లాంటివి ఉన్నా వాటిల్లో పిల్లలను బడికి పంపడం పేదలకు భారమే అవుతుంది. 3, 4, 5 తరగతులు చదువుతున్న వారి వయసు 10,11 ఏళ్లలోపే ఉంటుంది. వారికి సొంతంగా సైకిళ్లను ఇచ్చి బడులకు పంపేందుకు తల్లిదండ్రులు సాహసించరు. వ్యవసాయ, ఇతరత్రా పనులకు వెళ్లే వారు పిల్లలను రోజూ తీసుకెళ్లి బడిలో దింపి రావడం సైతం కష్టమవుతుంది. ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తే బాలికలను చదువు మాన్పించే ప్రమాదమూ పొంచి ఉంది.
* కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్తుంటారు. వారు లేనప్పుడు చిన్న పిల్లలను చూసుకునే బాధ్యతను ఇంట్లోని పెద్ద పిల్లలకు అప్పగిస్తారు. చిన్న పిల్లలను చూసుకునేందుకు పెద్దవారు బడి మానేస్తున్న వాస్తవాన్ని గుర్తించి గతంలో కొన్ని చోట్ల ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించారు. దీంతో ఇద్దరూ బడిలో ఉండేవారు. ఇప్పుడు ఒకరు ప్రీప్రైమరీకి, మరొకరు 3, 4, 5 తరగతులను నిర్వహించే మరో పాఠశాలకు వెళ్లడం కష్టమేననే అభిప్రాయాలున్నాయి.
* అబ్బాయిలను ప్రైవేటుకు, అమ్మాయిలను ప్రభుత్వ బడులకు పంపుతున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. రోజువారీ పనులకు వెళ్లే కుటుంబాల్లో ఇంటి వద్ద చిన్నచిన్న పనులను బాలికలతో చేయిస్తుంటారు. వీరిని పక్క గ్రామంలోని బడికి పంపేందుకు అదనంగా వెచ్చించాల్సి వస్తే బడి మాన్పించే అవకాశాలున్నాయి. అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలున్నా ఒక్కరికే లబ్ధి అందుతోంది. ప్రైవేటు యాజమాన్యాలు అమ్మఒడి మొత్తానికే చదువు చెబుతామంటూ ప్రవేశాలు తీసుకుంటున్నాయి. ఇది ప్రవేశాలపై ప్రభావం చూపనుంది.
విద్యా హక్కు చట్టం అమలెలా?
విద్యాహక్కు చట్టం ప్రకారం 1-5 తరగతుల ప్రాథమిక పాఠశాల కిలోమీటరు, ప్రాథమికోన్నత 3, ఉన్నత పాఠశాల ఐదు కి.మీ. దూరంలో ఉండాలి. ఇందుకు విరుద్ధంగా 3, 4, 5 తరగతులు చదివే వారిని మూడు కి.మీ.వరకు పంపించడమేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం బడులు అందుబాటులో లేకపోతే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలి. ఈ భత్యం చెల్లించినా వాహన సదుపాయం లేకపోతే విద్యార్థులు బడులకు చేరుకోవడం కష్టమే అవుతుంది.
చిన్న వయసులో ఎంత కష్టం
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం ప్రాథమిక పాఠశాలలో 31 మంది విద్యార్థులున్నారు. వీరిలో 17మంది 3, 4, 5 తరగతులవారు. కొత్త విధానం ప్రకారం వీరు ప్రతిరోజూ 5 కి.మీ.దూరంలోని టీకేపాడు జడ్పీ పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఈ మండలంలోని 52 పాఠశాలలను మార్పు చేస్తే చాలా మంది పిల్లలకు బడి దూరం అర కి.మీ.నుంచి ఆరు కి.మీ.వరకు కూడా పెరుగుతుంది. ఇదే జిల్లా వాకాడు మండలంలో కొన్నిచోట్ల అయితే 10, 12, 15 కి.మీ.దూరం కూడా వెళ్లాల్సి రావచ్చు.
క్షేత్రస్థాయిలో ఇలా..
* రాష్ట్రవ్యాప్తంగా 33,676 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటికి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఎంత దూరంలో ఉన్నాయో అధికారులు అంచనాలు రూపొందించారు. దాని ప్రకారం కిలోమీటరులోపు 17,600 పాఠశాలలు ఉండగా రెండు కి.మీ.లోపు 7వేలు, 3కి.మీ. ఆపైన ఉన్నవి 9వేలకుపైగా ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం బడులు లేనిచోట కేంద్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలను చెల్లిస్తోంది. సంస్కరణల కారణంగా పెరిగే దూరాభారానికి రవాణా సదుపాయంపై ప్రస్తావన లేదు.
* గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ఎంపీపీ చింతరేవు పాఠశాలలో 29మంది పిల్లలున్నారు. వీరిలో 23 మంది 3, 4, 5 తరగతులవారు. వారిని సమీపంలోని నిజాంపట్నం జిల్లా పరిషత్ పాఠశాలకు పంపిస్తే 6 కి.మీ.దూరం పెరుగుతుంది. ఈ మండలంలో 82 ప్రాథమిక పాఠశాలలను మార్పు చేస్తే 0.2 కి.మీ. నుంచి 6కి.మీ. దూరం పెరుగుతుంది.
* శ్రీకాకుళం మండలంలోని మండలపరిషత్ చల్లవానిపేట బడిలో 22మంది పిల్లలున్నారు. వారిలో 11మంది 3, 4, 5 తరగతుల వారున్నారు. వారిని 3 కి.మీ. దూరంలోని బైరివానిపేట ప్రాథమికోన్నత లేదా ఐదు కి.మీ. దూరంలోని ఎస్‌ఎస్ వలస ఉన్నతపాఠశాలకు పంపించాల్సి ఉంటుంది.
* చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం గడ్డూరు మండలపరిషత్ పాఠశాలనుంచి 3, 4, 5 చదివే 22 మంది విద్యార్థులు బట్టందొడ్డి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లాలంటే అదనంగా 3 కి.మీ. ప్రయాణించాలి.
కిలోమీటర్ల కొద్దీ వెళ్లడం అసాధ్యం
రాష్ట్రంలోని 70శాతం ప్రాథమిక పాఠశాలల్లో 40మందిలోపే విద్యార్థులున్నారు. ఇందులో 1,2 తరగతులు వేరుగా.. 3, 4, 5 తరగతులు విడిగా అంటే ప్రాథమిక పాఠశాలలు బలహీనమవుతాయి. 3, 4, 5 తరగతుల పిల్లలు స్వగ్రామాలను వదిలి కిలోమీటర్ల దూరం వెళ్లడం అసాధ్యం. బడి మానేసేవారు పెరుగుతారు.
- బాబురెడ్డి, గౌరవాధ్యక్షుడు, ఐక్య ఉపాధ్యాయ సంఘం.
ప్రాథమిక బడుల కనుమరుగు సరికాదు
ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కనుమరుగు చేయడం సరికాదు. జాతీయ విద్యావిధానాన్ని యథాతథంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవ పరిస్థితులను గమనించాలి. అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలు కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉందా? 3, 4, 5 తరగతుల వారు ఊరి బడిని వదిలి 3 కి.మీ. దూరంలోని యూపీ, ఉన్నత పాఠశాలలకు వెళ్లగలరా?
-కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ