స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... ఆయన స్పందన కోసం కొన్ని రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తప్పనిసరైతేనే ప్రభుత్వ తీరును కోర్టుకు నివేదించాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని, ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అభివృద్ధి పనులకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ.. కోర్టు ఆ సూచనలు చేసింది. దానిపై తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేసింది. ఆ కేసు విచారణకు వచ్చినపుడు రాష్ట్రంలో తాజా పరిస్థితిని , పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతున్న తీరును అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఎన్నికల సంఘం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగానూ ఈ అంశాలన్నింటినీ నివేదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ పోరు