హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం అందజేస్తోంది. ప్రభుత్వం అందించే సాయం కోసం బాధితులు ‘మీ సేవ’ కేంద్రాల వద్ద బారులు తీరారు. వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితులకు స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు.
కొన్నిచోట్ల సాయం అందడంలేదని ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే అందజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సాయం అందని వారు ‘మీ సేవ’ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో నగరంలోని అన్ని చోట్ల ఆయా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.
ఈ క్రమంలో తాజాగా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున వరద సాయం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.