జలాశయంలో పేరుకుపోయిన ఇసుకను ప్రభుత్వ ఖర్చుతోనే తవ్వనున్నారు. దాన్ని గట్టుమీద పోసిన తర్వాత అవసరమున్న వారికి విక్రయిస్తే సరిపోతుంది. కానీ... ఇసుకను అమ్మిపెట్టే బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఫలితంగా సంబంధిత సంస్థ ఏకంగా రూ.90 కోట్ల వరకు లాభం పొందనుంది. ఇదీ ప్రకాశం బ్యారేజ్‌లో డ్రెడ్జింగ్ చేశాక వచ్చే ఇసుక విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామం. ఇవీ వివరాలు...
ప్రకాశం బ్యారేజ్‌లోని వివిధ ప్రాంతాల్లో 1.20 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక మేటలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించింది. అందులో నుంచి ప్రస్తుతం సగం ఇసుకను వెలికి తీయాలని నిర్ణయించారు. ఇటీవల 12 రీచ్(స్ట్రెంచ్)లలోని 60 లక్షల ఘనపు మీటర్ల తవ్వకాలకు రూ.98కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచారు. కోల్‌కతాకు చెందిన రీచ్ డ్రెడ్జింగ్ లిమిటెడ్ అనే సంస్థ ఏడు రీచ్‌లకు 31% తకువ ధరకు టెండర్లను దాఖలు చేసింది. ఆ ఏడు రీచ్‌లు దానికే దక్కనున్నాయి. మిగిలిన అయిదింటికి స్థానిక సంస్థలు టెండర్లు వేశాయి. జలాశయం ఎగువన దాదాపు 10 కి.మీ.లోపు డ్రెడ్జింగ్ చేస్తారు. ఇసుకను కృష్ణా, గుంటూరు జిల్లాల వైపు, జలాశయానికి రెండు వైపులా నిలువ చేస్తారు.
ఒక టన్ను అమ్మకంతో రూ.100 లాభం
ప్రస్తుతం రాష్ట్రంలో జేపీ సంస్థకే ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు అనుమతి ఉంది. బ్యారేజ్ నుంచి వచ్చే ఇసుకనూ అదే సంస్థకు ఇచ్చారు. మొదట జలవనరుల శాఖ, ఏపీ ఎండీసీల ఆధ్వర్యంలో టెండర్లను పిలవాలని ప్రతిపాదించినా దానికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. డ్రెడ్జింగ్ టెండర్లను జలవనరుల శాఖ చేపట్టింది. ఇసుకను విక్రయించే అవకాశం జేపీ సంస్థకు దక్కింది. ఆ సంస్థ ఒక టన్నును రూ.475కు విక్రయిస్తుంది. ప్రభుత్వానికి రూ.375 చెల్లిస్తుంది. బ్యారేజ్ నుంచి సుమారు 90 లక్షల టన్నులు ఇసుక వెలికి తీయనున్నారు. వీటి అమ్మకాల ద్వారా రూ.427.50 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి 337.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గుత్త సంస్థకు రూ.90 కోట్లు లాభంగా మిగులుతుంది. డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన ఇసుక విక్రయాలు జేపీ సంస్థ ద్వారానే జరుగుతాయని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మాధవీలత వివరించారు. ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందన్నారు. జలాశయానికి వరద తాకిడి తగ్గిన వెంటనే డ్రెడ్జింగ్ ప్రారంభిస్తామని ఎస్‌ఈ మురళీకృష్ణారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: భూములపై అమాయకులకు నరకం, ఆర్థిక కష్టాలు