రాష్ట్రంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పిస్తుండగా.. స్థానికంగా ఉండే నిల్వ కేంద్రానికి వెళ్లి అక్కడికక్కడే (స్పాట్‌లో) బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ఇసుక కార్పొరేషన్‌కు విధివిధానాలపై అధ్యయనం చేస్తున్న మంత్రులు, అధికారుల బృందం తాజాగా మరిన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు నిల్వ కేంద్రం, డిపో వద్దకు వెళ్లి నచ్చిన ఇసుకను చూసి అక్కడే బుక్ చేసుకొని తీసుకెళ్లే అవకాశం కల్పించాలని భావించింది. నదులు, వాగులు, వంకలకు సమీపంలో ఉండే గ్రామస్థులు ఎడ్ల బండ్లపై ఉచితంగా ఇసుక తెచ్చుకునే వీలుకల్పించగా, ట్రాక్టర్లలో కూడా ఎటువంటి రుసుము లేకుండా తరలించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. అయితే కేవలం ఇళ్లు నిర్మించుకునే సామాన్యులకే ఈ అవకాశం ఇవ్వాలని, గుత్తేదారులు, పెద్ద భవంతులు నిర్మించే బిల్డర్లకు ట్రాక్టర్‌లో ఉచిత ఇసుక సరఫరా చేయకుండా చూడాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
తెలంగాణ విధానమే మేలు
ఇసుకకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. తమిళనాడులో రీచ్‌లకు టెండర్లు పిలిచి, గుత్తేదారులకు అప్పగించగా.. గుత్తాధిపత్యంతో గాడితప్పినట్లు గుర్తించారు. తెలంగాణలో అక్కడి ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు చేసి, విక్రయాలు చేస్తున్నారని.. ఆ విధానమే మేలని అభిప్రాయపడ్డారు. వేలం ద్వారా గుత్తేదారులకు రీచ్‌లు కేటాయించి, వారితోనే తవ్వకాలు, విక్రయాలు జరిపించి, ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే సరిపోతుందని మరో ప్రతిపాదన కూడా చేశారు. వీటిపై త్వరలో సీఎం తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రైతుకు దుఃఖం.. జనంపై భారం