Sajjala Fires On BJP: తెదేపా అధినేత చంద్రబాబు అజెండానే భాజపా నేతల అజెండా అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఆయనవేననీ.. స్ట్రిప్ట్ మాత్రం తెదేపా కార్యాలయంలో తయారవుతోందని ఆరోపించారు. తెదేపా, భాజపాలకు సొంత అజెండా లేదన్నారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతి స్కాములమయం అని గతంలో భాజపా నేతలు చెప్పారని సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారని ఆక్షేపించారు. కర్నూలులో హైకోర్టు ఉండాలంటారు.. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఆయా పార్టీలతో చంద్రబాబు విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు అని సజ్జల ఎద్దేవా చేశారు.
"మాటలు సోము వీర్రాజువి.. స్క్రిప్ట్ ఎన్‌టీఆర్ భవన్‌ది. తెదేపా నుంచి వెళ్లిన ఎంపీలే భాజపాను నడిపిస్తున్నారు. విశాఖలో రాజధాని వద్దని భాజపా నేతలు చెప్పాలి. తెదేపా, భాజపా, కాంగ్రెస్, సీపీఐ, జనసేన ఒకటే. భాజపా రాకముందు దేశానికి రూ.75 లక్షల కోట్లే అప్పు ఉంది. అధికారంలోకి వచ్చాక ఆ అప్పు రూ.135 లక్షల కోట్లుకు చేరింది. మోదీ పేరు పెట్టే రాష్ట్రంలో జగన్ ఇళ్లు కడుతున్నారు. రూ.50కే మద్యం అన్న సోము వీర్రాజు మాట చంద్రబాబు స్క్రిప్ట్‌లోదే. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇదే మద్యం పాలసీ అమలుచేస్తారా..?" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
BJP leaders on YCP govt: మంగళవారం జరిగిన ప్రజాగ్రహ సభలో వైకాపా ప్రభుత్వం భాజపా నేతలు విరుచుకుపడ్డారు. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళ్తారని ఆ పార్టీ జాతీయ నేత ప్రకాశ్ జావడేకర్ వ్యాఖ్యలు చేయటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ఓటీఎస్‌పై విస్తృతంగా ప్రచారం చేయండి..
Sajjala On OTS: వన్ టైం సెటిల్ మెంట్ ప్రయోజనాలపై ప్రతి ఊర్లో మౌత్ పబ్లిసిటీ విస్తృతంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటీఎస్‌తో లబ్ది పొందినవారు వారంతట వారు బయటకు వచ్చి ప్రచారం చేయాలని కోరారు. చైతన్య రథాలు తిప్పి అందరినీ చైతన్యపరచాలని సూచించారు. మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని పార్టీ కార్యాలయంలో సజ్జల ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్న సజ్జల... విపక్షాల ప్రచారాన్ని కొందరు నిజమేనని నమ్ముతున్నారన్నారు. ఈ ప్రచారంతో విపక్షాలు ఒకింత విజయం సాధిస్తున్నాయన్నారు. నిరుపేదల ఇళ్లను వారికి సొంతం చేసేందుకే వన్ టైం సెటిల్ మెంట్ ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నది ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
SOMU VEERRAJU: అన్నపూర్ణాంధ్రను.. అప్పుల ఆంధ్రగా మార్చారు: సోము వీర్రాజు