కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణ సహాయక చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. అధికార యంత్రాంగం, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తుంటే .. అసత్య ఆరోపణలు చేయడం తగదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడి సహా... వాక్సినేషన్ పై చర్చించలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
వాక్సిన్ తయారీ, సరఫరా అంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశమని.. ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? అని సజ్జల ప్రశ్నించారు. వ్యాక్సిన్ను 50 శాతం కేంద్రానికి , మిగిలిన 50 శాతం.. కేంద్రం సూచించిన రాష్ట్రాలకు వాక్సిన్ కంపెనీలు ఇస్తున్నాయని చెప్పారు. టీకాలపై కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వాక్సిన్ సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ రాశారని, ఏ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాక్సిన్ కోసం ఎంత మొత్తాన్నైనా వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు. కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలన్న సజ్జల.. సంక్షోభ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: