తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌లో దారుణం జరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. విషం కలిపి తల్లి, చెల్లిని హత్య చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన కిరాతక చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రావల్‌కోల్‌కు చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల పేరుతో బ్యాంకులో ఉన్న రూ. 25 లక్షలను డ్రా చేసి, బెట్టింగ్‌లో పోగొట్టాడు. దీనిపై గొడవ జరుగుతుందని అనుమానించిన సాయినాథ్‌రెడ్డి.. ఈ నెల 23న భోజనం వండుతుండగా రసాయన గుళికలు కలిపాడు. విషపూరిత భోజనం చేశాక.. తల్లి, చెల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 27న చెల్లి అనూష మృతి చెందగా.. మరుసటి రోజే ఈ నెల 28న తల్లి సునీత ప్రాణాలు కోల్పోయారు.
తల్లి, చెల్లి ఆస్పత్రి బిల్లులు చెల్లించడం కోసం.. 15 తులాల బంగారు నగలు కుదవ పెట్టగా.. అనుమానం వచ్చిన బంధువులు సాయినాథ్‌రెడ్డిని నిలదీశారు. అసలు విషయం తెలుసుకుని విస్మయపోయారు. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తులో సాయినాథ్ రెడ్డి అసలు విషయం బయటపెట్టాడని మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
సాయినాథ్‌రెడ్డి ఇంతటి కిరాతకానికి ఒడిగడతాడని తాము కలలోనూ ఊహించలేదని అతని మేనమామ పెంటారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అతనికి ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
- సంబంధిత కథనం : అమానుషం: విషం కలిపి తల్లిని, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు