ఆదాయపన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పరిమితమైంది. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు రూ.9 లక్షల కోట్ల ఆదాయపన్ను కేంద్ర ఖజానాకు జమ కాగా అందులో తెలంగాణ నుంచి రూ.37,806 కోట్లు(4.1%), ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.13,446 కోట్లు (1.4%) వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
తొలి స్థానంలో మహారాష్ట్ర
2016-17 నుంచి 2019-20 ఫిబ్రవరి 15 వరకు నాలుగేళ్లలో దేశ ఖజానాకు ఆదాయపన్ను కింద రూ.30.39 లక్షల కోట్లు రాగా అందులో 3.98% తెలంగాణ నుంచి, 1.57% ఆంధ్రప్రదేశ్ నుంచి వసూలైంది. దేశంలో గత మూడేళ్లలో ఆదాయపన్ను వసూళ్లు సగటున 13.14% వృద్ధి చెందగా తెలంగాణలో 15.16%, ఆంధ్రప్రదేశ్‌లో 11.95% వృద్ధి నమోదైంది. తెలంగాణలో నాలుగేళ్లలో 74,29,161 రిటర్న్స్ దాఖలు కాగా, తద్వారా రూ.1,21,193 కోట్లు ఆదాయపన్ను రూపంలో వసూలైంది. అంటే సగటున ఒక్కో అసెసీ నుంచి ఖజానాకు సగటున రూ.1.63 లక్షలు చేరినట్లు లెక్క. ఏపీ నుంచి నాలుగేళ్లలో 74,62,679 రిటర్న్స్ దాఖలు కాగా వసూలైన పన్ను మొత్తం మాత్రం రూ.47,823 కోట్లే. ఇక్కడ ఒక్కో రిటర్న్ నుంచి సగటున రూ.64,082 మాత్రమే వసూలైంది. ఆదాయపన్ను రూపంలో దేశ ఖజానాకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 34.23% వాటా అందుతోంది. జనాభా పరంగా దేశంలో తొలిస్థానంలో ఉండే ఉత్తర్‌ప్రదేశ్ పన్ను విషయానికొచ్చేసరికి 9వ స్థానానికి పరిమితమైంది. బిహార్ చివరి వరుసలో నిలిచింది.
ఏఐబీపీ ప్రతిపాదనలేవీ రాలేదు: కేంద్రం
ఆయకట్టు ప్రాంత అభివృద్ధి, నీటి నిర్వహణ (సీఏడీడబ్ల్యూఎం), ఏఐబీపీల కింద కేంద్ర సాయం కోరుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలేవీ రాలేదని కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రధాన మంత్రి క్రిషి సింఛాయి యోజన (పీఎంకేఎస్‌వై)-ఏఐబీపీ, సీఏడీడబ్ల్యూఎం పథకంలో భాగంగా 8 ప్రాజెక్టులను చేపట్టినట్లు పేర్కొంది. భాజపా సభ్యుడు వైఎస్ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
స్వచ్ఛభారత్‌లో తెలుగు రాష్ట్రాలకు నిధులు
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు 2014-15 నుంచి నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు 2018-19లో రూ.1381.11 కోట్లు, తెలంగాణకు రూ.515.05 కోట్లను విడుదల చేసినట్లు భాజపా సభ్యుడు టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కటారియా సమాధానంగా చెప్పారు.
కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి కోర్టులో ఉంది
కృష్ణా నది నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది నిర్వహణ బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధులకు సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉందని మంత్రి రతన్‌లాల్ కటారియా తెలిపారు. బోర్డుల పరిధి, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నియంత్రణ తదితర అంశాలపై జనవరి 21న కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు.
హెలికాప్టర్ పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వాయిదా
ప్రకాశం జిల్లా దొనకొండలో హెలికాప్టర్ పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పరిశీలన అనంతరం వాయిదా పడిందని కేంద్రం తెలిపింది. 2017లో ఈ ప్రతిపాదన వచ్చిందని, పలు సమావేశాల అనంతరం తక్కువ ధరకు భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని వెల్లడించింది. మార్కెట్ ధరకు భూమిని కొనుగోలు చేసి ఎయిర్‌ఫోర్స్ కమాండ్, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ రాజ్యసభలో సమాధానమిచ్చారు.
రూ.17.71 కోట్లు విడుదల
జాతీయ రహదారి-65లోని విజయవాడ- మచిలీపట్నం మధ్య ‘యూజర్ ఫీ’ నోటిఫికేషన్ గెజిట్‌లో ప్రచురించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ.1540.82 కోట్లని, 26.6.19 నుంచి 25.2.20 వరకు రూ.17.71 కోట్లను వాణిజ్య కార్యకలాపాల కోసం విడుదల చేసినట్లు వెల్లడించారు. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు.
ఇదీ చదవండి : 50 శాతం రిజర్వేషన్లతోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు!