ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి... మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని... ఒక వైపు పోలీసు ఉన్నతాధికారులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వారి తల్లిదండ్రులకు ఇవేమీ పట్టడం లేదు. ఈ కారణంగా ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని బోయిన్‌పల్లి ప్రాంతంలో బాలురు కారును మితిమీరిన వేగంతో నడుపుకుంటూ వచ్చి ఆటో, రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టారు. ఆటో నుజ్జనుజ్జు కాగా... కారు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. కూకట్‌పల్లికి చెందిన నాగమణి, కుమార్తె సంధ్య, ఇద్దరు మనవళ్లతో కలిసి ఆటోలో స్వర్ణధామానగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అతివేగం.. అనర్ధం..
మితిమీరిన వేగంతో కారు నడుపుకుంటూ వచ్చిన బాలురు మొదట ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగమణితో పాటు ఆమె ఇద్దరి మనవలు, కుమార్తె సంధ్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే బాలుడు మహాదేవ్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. సంధ్యతో పాటు మరో బాలుడు మాధవ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఆటోను ఢీ కొట్టిన కారు మరో ఇద్దరు ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టింది. వారు కూడా గాయాలపాలయ్యారు.
మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలి
తమ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా మైనర్లు వాహనాలు నడపకుండా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మద్యం సేవించి కారు నడిపారా లేక అతి వేగమే కారణమా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.