మొన్నటి వరకు తుపాను ప్రభావం.. తర్వాత రెండు రోజులు అక్కడక్కడా వానలతో వాతావరణం కాస్త చల్లబడింది. ఇప్పుడు మళ్లీ ఎండలు, వడగాలుల తీవ్రత పెరిగింది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా ముగ్గుల్లలో 42.98 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సామర్లకోట, బుట్టాయగూడెం, ఎర్రంపేట, ఆర్యావతం, అయినవిల్లి, నున్న, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 42 డిగ్రీలపైన నమోదవగా.. మరో 20 పైగా మండలాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉదయం ఏడు గంటలకే ఎండలు చురుక్కుమన్పిస్తుంటే.. 10 గంటల నుంచే వడగాల్పులు ఈడ్చికొడుతున్నాయి. కోస్తా ప్రాంతంలో ఉష్ణతాపం అధికంగా ఉంది.
రాష్ట్రంపై పడమర, వాయవ్య గాలులు వీస్తున్నాయి. మరో నాలుగైదు రోజులు ఎండలు, వడగాల్పులు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం రాష్ట్రంలోని 82 మండలాల్లో కొంతమేర, 19 మండలాల్లో తీవ్రంగానూ వడగాల్పుల ప్రభావం నమోదైంది. అనకాపల్లి జిల్లాలోని 13 మండలాలు, విజయనగరం జిల్లాలో 4, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో మండలంలో వడగాలుల ఉద్ధృతి కనిపించింది. ఆదివారం 207 మండలాల్లో ఉష్ణతాపం అధికంగా ఉంది. సోమవారం 505 పైగా మండలాల్లో ఉష్ణ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.