వర్షాకాలం కావడంతో జ్వరాల ఉద్ధృతి పెరుగుతోంది. సాధారణ జ్వరాలతోపాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఈ కేసులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. దగ్గు, తలనొప్పి వస్తేనే కొవిడ్ భయం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో జ్వరం వస్తే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిరుడు మలేరియా, డెంగీ కేసులు తక్కువ సంఖ్యలో వెలుగు చూశాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు రాష్ట్రంలో 990 మలేరియా, 994 డెంగీ కేసులు నమోదయ్యాయి. రికార్డుల్లోకి రాని కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉంటోంది.
* కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి.
* తూర్పుగోదావరి జిల్లా కూనవరం, జగ్గవరం, రేపాక, పాలగూడెం, ఇతర గిరిజన ప్రాంతాల్లోనూ వైరల్ జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. గడిచిన రెండు నెలల్లో కూటూరు పీహెచ్‌సీ పరిధిలో వందకు పైగా టైఫాయిడ్, 150 వరకు వైరల్ ఫీవర్లు వచ్చాయి.
దోమల వృద్ధితోనే..
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉంది. దీంతో నీరు ముందుకు కదలకపోవడంతో అక్కడ దోమలు వృద్ధి చెందుతున్నాయి.
* కడప జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.
* గుంటూరు జిల్లాలోని గురజాల వంటి మండలాల్లోని పంచాయతీల్లో తాగునీటి ట్యాంకుల నిర్వహణ తీరు ఘోరంగా ఉంది.
పురపాలికలు, పంచాయతీల్లో దోమల వ్యాప్తి నిరోధానికి చేసే ఫాగింగ్ చాలా చోట్ల నామమాత్రపు తంతుగానే సాగుతోంది. ఇళ్లలో ఏసీ మనకే కాకుండా దోమలకూ సదుపాయంగా ఉంటోంది. 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుండే గదులు.. డెంగీ కారక దోమల సంతాన వృద్ధికి చాలా అనుకూలం.
రక్తం చిక్కబడితే ప్రమాదం
మలేరియా కంటే క్రమంగా డెంగీ కేసులే అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెంగీ జ్వరంలో ప్లేట్‌లెట్లు తగ్గడం కన్నా రక్తం చిక్కబడటం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. రక్తం చిక్కబడితే మిగిలిన అవయవాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశించినా కేవలం 1% మందిలోనే జ్వర లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మాత్రమే తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి.
డెంగీ నిర్ధారణ పరీక్ష కేంద్రాల పెంపు: వైద్య, ఆరోగ్యశాఖ
రాష్ట్రంలో ఏటా మలేరియా, డెంగీ, గన్యా కేసులు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయో పరిశీలించి ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టాం. మలేరియా నిర్ధారణ పరీక్షలు అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. డెంగీ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు కిందటేడాది వరకు 24 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 54కి చేరింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో డెంగీ నిర్ధారణకు అవసరమయ్యే ఎలీసా రీడర్, పరికరాలను రూ.20 లక్షలతో సమకూర్చాం. తూర్పుగోదావరి జిల్లాలో కూనవరం ఏరియా ఆసుపత్రిలో జ్వర నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: kishan reddy: 'భాజపా శ్రేణులపై వైకాపా కక్షసాధింపు'