Attack on Minister Mallareddy: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి వాహన శ్రేణిపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ శివారులో ఆదివారం సాయంత్రం రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి ప్రసంగాన్ని కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా, వెంబడించి.. ఆయన వాహనశ్రేణిపై కుర్చీలు, చెప్పులు విసిరారు. ఈ సభకు రెడ్ల ఐకాసతోపాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో సభికుల వ్యతిరేక నినాదాలు, అరుపులతో గందరగోళం నెలకొంది. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జేఏసీ సభలో డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రామిరెడ్డి, రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డిలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ఇతర ఓసీ సామాజికవర్గ సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. ఓసీ విద్యార్థులకు విదేశాల్లో విద్యాభ్యాసం కోసం రూ.25 లక్షల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు మాట్లాడిన తరువాత మంత్రి మల్లారెడ్డి ప్రసంగించారు.
అడుగడుగునా వ్యతిరేక నినాదాలు... స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు ప్రతి పల్లెలో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుదలకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. ఆసరా, రైతుబీమా, రైతుబంధు, దళితబంధు పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి చెబుతుండగా... మాట్లాడటం ఆపాలంటూ సభికుల నుంచి అరుపులు మొదలయ్యాయి. దీంతో మంత్రి ప్రసంగం ముగించి వేదిక నుంచి కిందికి దిగారు.
కుర్చీలు, రాళ్లతో దాడి... మంత్రి బయటకు వెళ్తుండగా, నిరసనకారులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంబడించారు. మంత్రి వాహనశ్రేణి వెనుక పరుగెడుతూ కుర్చీలు, చెప్పులు, నీళ్ల సీసాలు, రాళ్లు విసిరారు. వారిని అదుపు చేస్తూ మంత్రి వాహనాలను సురక్షితంగా బయటకు పంపడానికి పోలీసులకు సుమారు 15-20 నిమిషాల సమయం పట్టింది.
రెడ్ల సింహగర్జన సభలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహారెడ్డి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర సలహాదారులు పెండ్యాల రాంరెడ్డి, రెడ్డి జేఏసీ కో-ఛైర్మన్ కొట్టెం మధుసూదన్‌రెడ్డి, మూడుచింతలపల్లి జడ్పీటీసీ సభ్యుడు (కాంగ్రెస్) సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, జేఏసీ ప్రతినిధులు కంకడాల సరోజిని, డీకే వసంతారెడ్డి, సతీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌ను ప్రశ్నిస్తున్నందుకే..
‘నాపై దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర ఉంది. ఆయన ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే అక్కసుతో తన అనుచరుల ద్వారా దాడి చేయించాడు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. రెండేళ్లలో కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని నేను వివరించాను. రెడ్లకు న్యాయం జరుగుతుందని చెబుతుండగా నినాదాలు చేశారు.'-మల్లారెడ్డి, మంత్రి
ఇవీ చదవండి: