రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే ఏపీ కేవియట్‌లు దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయడంతో పాటు, టెండర్ల ప్రక్రియ ముందుకు వెళ్లకుండా ఏపీని నిరోధించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203లో రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను ఏకపక్షంగా ప్రతిపాదించారని తెలంగాణ ఆరోపించింది. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టును చేపట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని పిటిషన్లో పేర్కొంది. అటు కృష్ణా బోర్డు కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలంగాణ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.
ఇదీ చదవండీ... ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ