కేంద్ర హోంశాఖ అడిషనల్ అఫిడవిట్‌లో హైకోర్టు, రాజధాని ఎక్కడ పెట్టాలో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంపై ఏపీ హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వతంత్ర న్యాయవ్యవస్థను తాకే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని సాధన సమితి ప్రతినిధులు అన్నారు. అదనపు అఫిడవిట్‌లో అనవసరమైన అంశాలు జోడించారని... ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగిందని ఎందుకు పొందుపరచలేదని... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి రాష్ట్ర హైకోర్టు శంకుస్థాపన చేసిన విషయాన్ని అదనపు అఫిడవిట్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
ఇప్పటివరకు దాఖలు చేసిన మూడు అఫిడవిట్‌లలో అవసరమైన అంశాలు చెప్పలేదని... రాష్ట్ర ప్రజలపై కక్ష సాధించాలనే ధోరణి... అయోమయం... గందరగోళం సృష్టించాలనే తీరు అదనపు అఫిడవిట్‌లలో కనిపించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిని కాపాడుతుందని న్యాయవాదులుగా తాము అనుకోలేదని... ఇంతకు ముందు వేసిన అఫిడవిట్‌లలోనూ అసలు విషయాలు చెప్పకుండా రాజధానితో తమకు సంబంధం లేదని చెబుతూ వస్తోందన్నారు. రాష్ట్రాన్ని...అమరావతిని రక్షించేది తామేనని ఇంతవరకు చెప్పిన భాజపా నేతలు... ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. కేంద్రం వేసిన అఫిడవిట్‌తో కొందరు మురిసిపోతున్నారని... అమరావతి రాజధాని కచ్చితంగా బతుకుతుందనే నమ్మకం తమకు ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 9,999 కరోనా కేసులు, 77 మరణాలు