Uppal Asian Theater Issue: తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన గోగిరెడ్డి వనజ 2016 నవంబరు 22న బంధువులు, స్నేహితులతో కలిసి సినిమా చూడడానికి ఉప్పల్‌లోని ఏషియన్ థియేటర్‌కు వెళ్లారు. అప్పటికే సినిమా ప్రారంభం కావడంతో థియేటర్ లోపల చిమ్మ చీకటి అలుముకుంది. సీటును చూపించేందుకు సిబ్బంది లేకపోవడంతో లోనికి వెళ్తుండగా మెట్ల దగ్గర కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కాలు విరిగిపోగా వెంటనే ఆమెను స్నేహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా రెండు శస్త్రచికిత్సలు చేసి కాలులో స్టీలురాడ్లను అమర్చారు.
వనజ సుమారు 8 నెలలు కదలకుండా ఉండడమే కాకుండా రూ.8 లక్షల వైద్య బిల్లులు చెల్లించారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అయినా స్పందించక పోవడంతో ఆమె రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన ఫోరం.. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది. సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత థియేటర్ల యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుకు వైద్య ఖర్చుల కింద రూ.3,81,721తో పాటు శారీరక, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.25,000, వ్యాజ్యపు ఖర్చులకుగాను మరో రూ.10,000 కలిపి నెలన్నరలోపు చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించింది. నిర్దేశించిన సమయంలోపు చెల్లించకుంటే ఆ మొత్తానికి సాలీనా 9శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించింది.