రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. దీనికి రాష్ట్రగవర్నర్ ఆమోదాన్ని తెలియచేసినట్టు సమాచారం. పదవీకాలాన్ని కుదించేందుకు పంచాయితీరాజ్ చట్టంలోని సెక్షన్ 200ను సవరిస్తూ ఆ శాఖ 2 ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ రెండు ఉత్తర్వులనూ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ జారీ చేసిన ఆమోదాన్ని సైతం ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. రాజ్యాంగంలోని 237కే ప్రకారం రాష్ట్రప్రభుత్వం తనకు సంక్రమించిన అధికారాల మేరకు ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించేందుకు పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచారం. ఈ రెండు ఉత్తర్వులనూ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ రిజిస్టర్‌లో రహస్యంగా ఉంచటంతో వివరాలు పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. 2016 ఏప్రిల్ 1 తేదీన ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. కొత్త ఆర్డినెన్సు ప్రకారం ఆయన పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించటంతో అధికారికంగా ఆయన పదవీకాలం మార్చి 31, 2019తో ముగిసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: