Ramanuja Sahasrabdi Vedukalu: సమతామూర్తి శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు శోభాయమానంగా జరిగింది. వేడుకల్లో అతి ప్రధానమైన అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలతో కలిపి ఘటిక, పాలికలో ఉంచి క్రతువు చేపట్టారు. రుత్వికవరణంలో భాగంగా యజ్ఞాల్లో పాల్గొనే రుత్వికులకు కంకణ ధారణ, దీక్షా వస్త్రాలు సమర్పించారు. మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించే శ్రీనివాసచార్యులు, మధుసూధనాచార్యులకు వస్త్రాలు సమర్పించారు.
12 రోజుల మహాక్రతువు..
అంతకుముందు 12 రోజుల మహాకత్రువు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ప్రార్థిస్తూ విశ్వక్సేనుడి ఆరాధన, వాస్తుశాంతి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పల్లకిలో పెరమాళ్లను యాగశాలకు శోభాయాత్రగా తీసుకొచ్చారు. వేద పండితులు, రుత్వికులు, వాలంటీర్లు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ స్మరణతో శోభాయాత్ర వైభవంగా జరిగింది. రాహుకాలం ముగిశాక త్రిదండి చినజీయర్ స్వామితోపాటు ఏడుగురు ఆచార్యులు అహోబిలం జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి, అష్టాక్షరీ సంపత్ కుమార జీయర్ స్వామి, శ్రీరామచంద్ర జీయర్ స్వామి, ముక్తినాథ జీయర్ స్వామి హాజరై పుణ్యవచనాలిచ్చారు. చిన్నజీయర్ స్వామి వాస్తుశాంతి పూజ నిర్వహించి దాని ప్రాధాన్యత, విశిష్టతను భక్తులకు వివరించారు.
1035 కుండలాలు.. 5వేల మంది రుత్వికులు..
రెండోరోజు ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహా యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండలాల్లో ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులు హోమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న హోమంలో మొదట అగ్నిహోత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం మంత్ర పూర్వకంగా శమి, రావి కర్రలను పెరుగు చిలికినట్లు చిలుకుతుంటారు. భక్తులు.. భగవన్నామస్మరణ చేస్తుంటే రెండు కర్రల రాపిడికి అగ్నిహోత్రం పుడుతుంది. ఆ అగ్నిని 1035 కుండలాల్లో పోసి హోమాన్ని నిర్వహించనున్నారు.
భూమండలంలోనే ఇంతపెద్ద హోమం తొలిసారి..!
ఇంత పెద్ద ఎత్తున హోమాన్ని నిర్వహించడం భూమండలంలోనే తొలిసారని అహోబిలం జీయర్ స్వామి తెలిపారు. గతంలో పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో 1972లో, చినజీయర్ స్వామి సమక్షంలో 1980, 1994లో మూడుసార్లు తిరుమల కొండపై యాగాలు చేసినట్లు గుర్తుచేశారు. అయితే తిరుమలను కలియుగ వైకుంఠంగా భావిస్తామని, ఇప్పుడు శ్రీరామనగరంలో నేలపై 5 వేల మంది రుత్వికులతో యాగం చేయడం తొలిసారని అహోబిలం జీయర్ స్వామి వివరించారు. యాగం వల్ల వెలువడే పొగ.. కార్బన్ డైయాక్సైడ్ కాదని, మన చూట్టూ ఉండే కాలుష్యాన్ని, వ్యాధి కారకాలను తొలగించే పరమార్థమే ఈ మహాయాగమని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.
నేటి కార్యక్రమాలు..
అంకురార్పణ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు, ఆ తర్వాత 4 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు హోమం చేయనున్నారు. అనంతరం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికి శ్రీవాసుదేవేష్టిని చేస్తారు. ఆ తర్వాత గంటన్నరపాటు లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు జరగనున్నాయి.
ఇదీచూడండి: రామానుజ సహస్రాబ్ది సమారోహం.. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తకు ఆకాశమంత గౌరవం