హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ (KRMB Chairman MP Singh) అధ్యక్షతన భేటీ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి, గోదావరి జలాల మళ్లింపుపైనా బోర్డు దృష్టి సారించనుంది. చిన్ననీటివనరులు, తాగునీటి లెక్కింపులు, బోర్డు తరలింపు.. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డు నిర్వహణపైనా చర్చిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదులపైనా దృష్టి పెట్టనుంది. నీటి వివాదాలల్లో రాష్ట్ర వాదనను గట్టిగా వినిపిస్తామని తెలంగామ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు సరికాదన్నారు.
అక్రమ ప్రాజెక్టు...
రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టని రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. టెలిమెట్రీల విషయంలోనూ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీని ఏపీకి తరలించవచ్చని.. అయితే వైజాగ్ తరలించడం కృష్ణా బేసిన్ దాటి గోదావరి బేసిన్‌లో పెట్టడం సరికాదని రజత్ స్పష్టం చేశారు.
నీళ్ల కోసమే ఉద్యమం...
తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగిందన్న రజత్ కుమార్.. తెలంగాణలో ఎక్కువ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర అవసరాలతో పోలిస్తే 299 టీఎంసీలు చాలా తక్కువన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలో తలపెట్టిందేనన్న రజత్ కుమార్.. కొన్ని డీపీఆర్‌లు సమర్పిస్తున్నామని వెల్లడించారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణలో జనాభా 300 శాతం పెరిగిందన్న రజత్ కుమార్.. తాగునీటి అవసరాలకు కేటాయింపులు పెంచాలని కోరతామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పెరిగిన దృష్ట్యా నీటి వాటా కచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని.. కేఆర్ఎంబీ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని వెల్లడించారు
ఇదీ చూడండి: