పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు, చాలాచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల వరకు కురిసింది. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. టెక్కలి ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భవానీ నగర్, బాపారెడ్డి కాలనీ, రాందాసు పేట ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సంతబొమ్మాళి మండలం నౌపడాలో కాలువలు సరిగా లేక వీధుల్లో వరదనీరు నిలిచి యింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో..
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రావివలసలో 88.25 మి.మీ, గార మండలం కళింగపట్నంలో 86 మి.మీ, విజయనగరం జిల్లా సాలూరులో 52.75 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కృష్ణా జిల్లా బాపులపాడు, నందిగామ, గంపలగూడెం, గుంటూరు జిల్లా బెల్లంకొండ తదితర ప్రాంతాల్లో వానలు కురిశాయి.
ముందుకొచ్చిన కడలి..!
వాయుగుండం ప్రభావంతో జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు గెడ్డలు ఉప్పొంగాయి. ఉదయం ముక్కాం, చేపలకంచేరు వద్ద 60 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చి ఇళ్లను తాకడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తుపాను హెచ్చరికతో రెండు రోజులుగా వేటకు ఎవరూ వెళ్లకపోవడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. భోగాపురం తహసీల్దారు కల్పవల్లి తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఆమె సూచించారు.
సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య గరిష్ఠంగా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో 153.25 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో 129, జీలుగుమిల్లిలో 111.25, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో 106.5, రాజమహేంద్రవరంలో 99.75 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇదీ చూడండి. నది సంద్రంలో నిర్వాసితుల విలవిల